Latest News

Saturday, March 26, 2016

ఏప్రిల్‌ నుండి రెగ్యులర్‌ షూటింగ్‌లో రాహుల్‌ కొత్త చిత్రం


   ఏప్రిల్‌ నుండి రెగ్యులర్‌ షూటింగ్‌లో రాహుల్‌ కొత్త చిత్రం

రాహుల్‌ రవీంద్రన్‌, కార్తీక్‌ ఆనంద్‌ ప్రధాన పాత్రల్లో…అమ్మ నాన్న ఫిలింస్‌ బ్యానర్‌పై రాథోడ్‌ దర్శకత్వంలో యువ నిర్మాత మణీంద్రన్‌. ఎమ్‌ రూపొందించనున్న చిత్రం ఏప్రిల్‌ నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాథోడ్‌ మాట్లాడుతూ.. పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఈ చిత్రం ఉంటుంది. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని కమర్షియల్‌ అంశాలు ఇందులో ఉన్నాయి. రాహుల్‌ రవీంద్రన్‌, కార్తీక్‌ ఆనంద్‌ ప్రధాన పాత్రలు చేస్తున్న ఈ చిత్రానికి హీరోయిన్‌లు, ఇంకా ఇతర తారాగణం ఎంపిక జరుగుతోంది…ఏప్రియల్‌ నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతుంది..అని అన్నారు.

చిత్ర నిర్మాత మణీంద్రన్‌. ఎమ్‌ మాట్లాడుతూ…కథ చాలా బాగా వచ్చింది. అందుకే ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా నిర్మించనున్నాము. ఏప్రిల్‌ నుండి షూటింగ్‌ మొదలవుతుంది. మంచి చిత్రంగా మా అమ్మ నాన్న ఫిలింస్‌ బ్యానర్‌లో ఈ మూవీ నిలిచిపోతుందనే నమ్మకం ఉంది..అని అన్నారు.

ఈ చిత్రానికి కథ-మాటలు: శ్రీనాథ్‌ రెడ్డి, సినిమాటోగ్రఫీ: జవహర్‌ రెడ్డి, సంగీతం: సునీల్‌ కశ్యప్‌, సహనిర్మాత: ప్రశ్నాత్‌ తాత, నిర్మాత: మణీంద్రన్‌. ఎమ్‌, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: రాథోడ్‌.

మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us

Facebook: https://www.facebook.com/Tollybeatsmedia/

Twitter: https://twitter.com/BeatsTolly

YouTube: https://www.youtube.com/channel/UCmc5YqKIfIWK5pdLCqLJv6w

Blog: http://tollybeatsmedia.blogspot.in

Google+: https://plus.google.com/u/0/112797037583980613598

‘రన్’ సినిమా రివ్యు


‘రన్’ సినిమా రివ్యు

  Tolly Beats Rating: 3.75/5

తెలుగులో ఎప్పటికప్పుడు విలక్షణ సినిమాలు చేసుకుంటూ మెప్పిస్తోన్న హీరో సందీప్ కిషన్, తాజాగా తమిళ, మళయాలంలో బంపర్ హిట్ కొట్టిన ‘నేరమ్’ అనే సినిమాను తెలుగులో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ‘రన్’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా మంచి అంచనాలతో హోళీ కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టైమ్ ప్రధానంగా నడిచే ప్రయోగాత్మక సినిమాగా ప్రచారం పొందిన ఈ సినిమా ఎంతమేరకు ఆకట్టుకుందీ? చూద్దాం..

కథ :

సంజయ్ (సందీప్ కిషన్) అనే యువకుడి జీవితంలో టైమ్ చుట్టూ ఒక్కరోజు జరిగే సంఘటనల సమాహారమే ‘రన్’ సినిమా. సంజయ్, తన అక్క పెళ్ళి కోసం వడ్డీ రాజా (బాబీ సింహా) అనే కిరాతక వడ్డీ వ్యాపారి వద్ద అప్పు తీసుకుంటాడు. ఆ అప్పు తీర్చే సమయానికి అతడి జాబ్ పోతుంది. ఈ పరిస్థితుల్లో ఫ్రెండ్ ద్వారా తీసుకున్న డబ్బుతో ఆ అప్పు తీర్చాలనుకుంటాడు. అయితే అనుకోని సంఘటనలో ఆ డబ్బు దొంగతనానికి గురవుతుంది.
ఈ క్రమంలో అప్పెలా తీర్చాలీ అనుకుంటున్న సమయంలోనే సంజు ప్రేమించిన అమ్మాయి అమూల్య (అనీషా), అతడి కోసం ఇంట్లోనుంచి పారిపోయి వస్తుంది. ఒకేరోజు ఇన్ని సమస్యలు ఉన్న వ్యక్తి సాయంత్రానికల్లా ఆ సమస్యలను ఎలా పరిష్కరించుకున్నాడూ? ఈ ఒక్కరోజు ప్రయాణంలో ఏమేం జరిగాయి? అన్న ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా.

ప్లస్ పాయింట్స్ :

‘టైమ్’ అనే అంశం చుట్టూ ఒక కథ అల్లి, దానిచుట్టూ తిరిగే కొన్ని సమస్యలు, వ్యక్తులతో ఒక్కరోజులో కథ చెప్పాలన్న ఆలోచనను ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. ఇక ఆ ఆలోచనను పూర్తిస్థాయి కథగా మలిచిన విధానం కూడా బాగుంది. ప్రధాన కథకు ఒక్కో క్యారెక్టర్‌ను కలుపుతూ చేసిన స్క్రీన్‌ప్లే ప్రయోగం బాగా ఆకట్టుకుంటుంది. ఇక సినిమా పరంగా ఫస్టాఫ్‌ను ఈ సినిమాకు హైలైట్‌గా చెప్పుకోవచ్చు. కథలోని అసలు పాయింట్‌ని ఈ భాగంలోనే తెలివిగా పరిచయం చేశారు. రెండు గంటల లోపే నిడివి ఉన్న ఈ సినిమా అనవసర ఆర్భాటాలకు పోకుండా నడవడం బాగుంది.

ఇక హీరో సందీప్ కిషన్ ఎప్పట్లానే నటుడిగా మంచి ప్రతిభే కనబరిచాడు. తన గత సినిమాలోల్లా పూర్తిగా హీరో చుట్టూనే తిరిగే కథ కాకపోవడంతో సందీప్, తన పాత్ర పరిధి దాటే ప్రయత్నం చేయలేదు. ఎమోషనల్ సన్నివేశాల్లో బాగా నటించాడు. అనీషా పాత్ర కథలో కీలకమైనదే అయినా తక్కువ నిడివి ఉన్నది. ఉన్నంతలో ఆమె ఫర్వాలేదనిపించింది. ఇక వడ్డీ రాజాగా బాబీ సింహా బాగా చేశాడు. పోలీసాఫీసర్‌గా బ్రహ్మాజీ, పొలిటికల్ లీడర్‌గా పోసాని అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు సెకండాఫ్‌ను మైనస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. సెకండాఫ్‌లో సినిమాను కొన్నిచోట్ల మందకొడిగా నడిపించారు. ఈ టైమ్‍లో వచ్చే సన్నివేశాలు కొన్ని బోరింగ్‌గా ఉన్నాయి. బాబీ సింహా, అనీషాల పాత్రలకు సరైన క్యారెక్టరైజేషన్ లేదు. వడ్డీ రాజా అనే పాత్ర సినిమాను ఇన్ని మలుపులు తిప్పేంత బలంగా చిత్రించలేదు. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లకు వచ్చేసరికి తొందర తొందరగా చుట్టేసి, చివర్లో సినిమాను తేలిపోయేలా చేశారు.
హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేదు. ఈ లవ్‌స్టోరీలో ఫ్రెష్‌నెస్ లేదు. ఇక సెకండాఫ్‌లో హీరోయిన్ పాత్రను చాలాచోట్ల ప్రస్తావనకు కూడా తీసుకురాకపోవడం ఆకట్టుకోలేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే, మళయాల మాతృకకు కథ, స్క్రీన్‌ప్లే అందించిన ఆల్ఫన్స్ పుత్రన్ స్టైల్ నెరేషన్ గురించి చెప్పాలి. మళయాల ఒరిజినల్ కథకు ఏమాత్రం మార్పులు చేయకుండా తెలుగులో దర్శకుడు అనీ అలాగే చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే తెలుగు సినిమాకు ఈ కథకు కావాల్సిన మూడ్‌ను సెట్ చేయలేకపోయారు. చివర్లో సినిమాను చకచకా తేల్చేయడం విషయంలో జాగ్రత్త పడాల్సింది. దర్శకుడిగా టైటిల్ కార్డ్స్ పడడం, ఫస్టాఫ్‌లో కొన్ని స్టైలిష్ షాట్ కంపోజిషన్స్‌లో అనీ ప్రతిభను మెచ్చుకోవచ్చు. ఓవరాల్‌గా దర్శకుడిగా ఫర్వాలేదనిపించాడు.
రాజశేఖర్ సినిమాటోగ్రఫీని సాంకేతిక అంశాల పరంగా మరో ప్రధాన ప్లస్‌గా చెప్పుకోవాలి. తక్కువ బడ్జెట్‌లో, తక్కువ లొకేషన్స్‌లో నడిచే సినిమాను అన్నివిధాలా ఉన్నంతలో క్వాలిటీగా ఉంచేలా చేయడంలో సినిమాటోగ్రాఫర్ పనితనం బాగుంది. సంగీత దర్శకుడు సాయి కార్తీక్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఫర్వాలేదు. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు సరిగ్గా సరిపోయింది. ఎడిటింగ్ బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

తీర్పు :
ఒక భాషలో హిట్ అయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేయాలంటే, రీమేక్ చేస్తోన్న భాషకు కనెక్ట్ అయ్యే బలమైన ఎమోషనో లేదా కొత్తదనమో ఉండాలి. ‘రన్’ సినిమా ప్రధానంగా టైమ్ అనే అంశం చుట్టూ ఒక్కరోజులో జరిగే విలక్షణ కథ కావడంతో తెలుగు ప్రేక్షకులకూ ఈ అంశం కొత్తగా కనిపిస్తూ మెప్పించేదిగా చెప్పుకోవచ్చు. కథాంశం కొత్తగా ఉండడం, ఫస్టాఫ్‌లో ఈ కథాంశాన్ని తెలివిగా పరిచయం చేయడం, పాత్ర పరిధిలోనే ఉంటూ మెప్పించిన నటీనటవర్గం.. ఇలాంటి ప్లస్‌లతో వచ్చిన ఈ సినిమాలో సెకండాఫ్‌ కొంత బోరింగ్‌గా ఉండడం, చివర్లో అంతా ఒక్కసారే తొందర తొందరగా తేల్చేయడం లాంటివి మైనస్‌లుగా చెప్పుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే.. రెండు గంటల లోపే నిడివి ఉన్న ఈ సినిమా కథలో, కథ చెప్పే విధానంలో కొత్తదనం కోరుకునే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలనే ఇష్టపడేవారికి కూడా ఈ సినిమా ఫర్వాలేదనిపిస్తుంది.

---రివ్యూ బై విజ్ఞాన్ దాసరి

మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us

Facebook: https://www.facebook.com/Tollybeatsmedia/

Twitter: https://twitter.com/BeatsTolly

YouTube: https://www.youtube.com/channel/UCmc5YqKIfIWK5pdLCqLJv6w

Blog: http://tollybeatsmedia.blogspot.in

Google+: https://plus.google.com/u/0/112797037583980613598

Friday, March 25, 2016

‘ఉపిరి’ సినిమా రివ్యు


‘ఉపిరి’ సినిమా రివ్యు

Tolly Beats Review: 4.75/5

ఎప్పటికప్పుడు ప్రయోగాత్మక సినిమాలను చేసుకుంటూ ఈతరం ప్రేక్షకుల్లోనూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నాగార్జున, తమిళ స్టార్ హీరో కార్తిల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘ఉపిరి’. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని భారీ అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి విడుదలకు ముందు ఈ సినిమాకు అంతటా కనిపించిన పాజిటివ్ బజ్‌ను సినిమా నిజంగానే కొనసాగించిందా? చూద్దాం..

కథ :

ఓ ప్రమాదం బారిన పడి పూర్తిగా కాళ్ళు, చేతులు పనిచేయకుండా వీల్‌చైర్‌కే అతుక్కుపోయిన కోటీశ్వరుడైన విక్రమ్ ఆదిత్య (నాగార్జున), తన బాగోగులను చూసుకునేందుకు ఒక సరైన వ్యక్తి కోసం వెతుకుతుంటాడు. ఇక అదే క్రమంలో జైలు నుంచి బయటకొచ్చిన శీను (కార్తి), విక్రమ్ దగ్గర ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళతాడు. రోజూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉండే ఓ దిగువ మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన శీను, విక్రమ్‌కి నచ్చడంతో అతడి బాగోగులను చూసుకునే ఉద్యోగం సంపాదిస్తాడు.

డబ్బుంటేనే సంతోషం ఉంటుందనుకునే శీను, తాను కోరే సంతోషాన్ని ఎవరిస్తారా? అని ఎదురుచూసే విక్రమ్.. ఈ ఇద్దరూ ఆ తర్వాత చేసే ప్రయాణమే ‘ఊపిరి’. ఈ ప్రయాణంలో ఏమేం జరిగాయి? ఎవరెవరి జీవితాలు ఎలా మారాయి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసే తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్ :

ఫ్రెంచ్‌లో క్లాసిక్ అనిపించుకున్న ‘ది ఇన్‌టచబుల్స్’ అనే సినిమాను.. తెలుగులో, ఇక్కడి ఆలోచనా విధానానికి, పరిస్థితులకు, నేపథ్యానికి అనుగుణంగా మార్చుకొని, అసలు కథను, ఆత్మను ప్రేక్షకులకు పరిచయం చేయాలన్న ఆలోచనకు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఇక ఆ ఆలోచనను నూటికి నూరు శాతం విజయవంతంగా పూర్తి చేయగలగడం ఈ సినిమా విషయంలో అసలైన ప్లస్ పాయింట్. నాగార్జున కార్తీల జర్నీని సినిమా మొత్తం అలా చూస్తూండిపోయేలా సన్నివేశాలను రూపొందించిన తీరు అబ్బురపరుస్తుంది. కార్తీ పాత్రలోని చలాకీతనం, అల్లరి; నాగార్జున పాత్రలోని స్వచ్ఛమైన నిండుతనం.. ఈ రెండింటినీ ప్రతిబింబించేలా వీరి ప్రయాణంలో వచ్చే సన్నివేశాలు నవ్విస్తూ, ఏడిపిస్తూ, ఒక అద్భుతమైన అనుభూతినిస్తూ సాగిపోతూ కట్టిపడేస్తాయి.

ఇక నటీనటుల విషయానికి వస్తే, ముందుగా ఇలాంటి ఒక ప్రయోగాత్మక పాత్రను ఒప్పుకొని, దాన్ని పూర్తిస్థాయిలో సొంతం చేసుకొని చేసిన నాగార్జున గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! నాగార్జునకు ఈ సినిమాలో ఎక్కువగా క్లోజప్ షాట్స్ ఉన్నాయి. ఆయన ఏ స్థాయి నటుడో ఈ సినిమా చూస్తే ఇట్టే అర్థమైపోయేంత అద్భుతంగా ఈ పాత్రలో ఒదిగిపోయారు. ఇక శీను పాత్రలో కార్తీని తప్ప మరొకరిని ఊహించుకోలేనంతగా కార్తీ కట్టిపడేశాడు. అతడి కామెడీ టైమింగ్, పాత్రను సొంతం చేసుకున్న విధానం, ఎమోషనల్ సన్నివేశాల్లో మెప్పించిన తీరు.. అన్నివిధాలా అబ్బురపరుస్తాడు. తమన్నా తన పాత్రలో బాగా నటించడంతో పాటు అందంగా కూడా ఉంది. సొంతంగా తమన్నాయే చెప్పిన డబ్బింగ్ కూడా బాగుంది. జయసుధ, ప్రకాష్ రాజ్.. ఇలా ప్రధాన పాత్రల్లో నటించినవారంతా చాలా బాగా చేశారు. శ్రియ, అనుష్కల స్పెషల్ అప్పియరన్స్ మరో హైలైట్.

మైనస్ పాయింట్స్ :

కట్టిపడేసే ఫస్టాఫ్ తర్వాత సినిమా కొద్దిసేపు నెమ్మదించినట్టు అనిపిస్తుంటుంది. పారిస్ నేపథ్యంలో ఈ సమయంలో వచ్చే కొన్ని సన్నివేశాలు కాస్త డల్ అనిపిస్తాయి. అదేవిధంగా కార్తీ-తమన్నాల మధ్యన వచ్చే ఓ పాట అప్పటికి అవసరం లేనిదనిపించింది. కథ రీత్యా వచ్చేదే అయినా స్పెషల్ సాంగ్ కాకుండా ఆ ప్లేస్‌లో మరింకేదైనా అంశం జత చేసుంటే బాగుండేదనిపించింది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే ఈ సినిమా అన్ని విధాలా ది బెస్ట్ అని చెప్పొచ్చు. ముందుగా దర్శకుడు వంశీ పైడిపల్లి గురించి ప్రస్తావించుకుంటే.. ఒక ఫ్రెంచ్ కథలోని బేసిక్ ఎమోషన్‌ను ఎక్కడా మార్చకుండా దాన్ని తెలుగు సినిమాకు, పద్ధతికి మార్చుకొని రాసుకున్న స్క్రీన్‌ప్లే కట్టిపడేసేలా ఉంది. దర్శకుడిగానూ వంశీ పైడిపల్లి ప్రతిభను, మేకింగ్ పరంగా చేసిన మ్యాజిక్‌ను ప్రతి పదినిమిషాలకొసారి చూడొచ్చు. చిన్న చిన్న ఎమోషన్స్‌ని కూడా వంశీ కథలో చెప్పుకొచ్చిన విధానానికి ఎంత అభినందించినా తక్కువే! సెకండాఫ్‍ మొదట్లో ఇంకొంచెం జాగ్రత్తగా సినిమాను నడిపి ఉండే బాగుండేదనిపించింది. ఇవన్నీ పక్కనబెడితే.. ఇలాంటి ఒక సినిమాను తెరకెక్కించాలన్న ఆలోచనకు, దాన్ని సినిమాగా తీర్చిదిద్దడంలో చూపిన ప్రతిభను చూశాక దర్శకుడికి హ్యాట్సాఫ్ చెప్పాలనిపిస్తుంది.

గోపీ సుందర్ సంగీతం అద్భుతంగా ఉంది. సినిమా అయిపోయాక కూడా ‘నువ్వేమిచ్చావో’ అన్న పాట, పతాక సన్నివేశాల్లో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వెంటాడతాయి. పీ.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ అదిరిపోయిందనే చెప్పాలి. ఫస్ట్ సీన్ నుంచి క్లైమాక్స్‌కి వచ్చేసరికి కథలో మారుతున్న ఎమోషన్‌ను నటీనటులంతా ఎలా క్యారీ చేశారో, వినోద్ సినిమాటోగ్రఫీ కూడా అలాగే క్యారీ చేసింది. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో కొన్ని ఇంటర్‌కట్స్ దగ్గర ఎడిటింగ్ మ్యాజిక్ చూడొచ్చు. అబ్బూరి రవి రాసిన డైలాగ్స్ సినిమాకు మరింత అర్థాన్ని తెచ్చిపెట్టేలా ఉన్నాయి. ఆర్ట్ వర్క్ బాగుంది. పీవీపీ సినిమా నిర్మాణ విలువలను, సాహసాన్ని మెచ్చుకోకుండా ఉండలేం!

తీర్పు :

ఒక ఆలోచనను, ఆనందాన్ని, బాధని, భావాన్ని, భావోద్వేగాన్ని.. ఇలా ఎన్ని చెప్పాలన్నా సినిమా అనే మాధ్యమానికి అవధుల్లేవన్నది సత్యం. ఆ సత్యాన్ని తెలుసుకొని నవ్విస్తూ, ఏడిపిస్తూ, కదిలిస్తూ, ఎక్కడికో తీసుకెళ్ళి వదిలేసి వచ్చే ఓ అందమైన వేడుక లాంటి సినిమా ‘ఊపిరి’. కథ ద్వారా చెప్పాలనుకున్న ఆలోచన, బలమైన భావోద్వేగం, నవ్విస్తూనే ఏడిపించే బలమైన సన్నివేశాలు, నాగార్జున, కార్తీల అద్భుతమైన నటన, కట్టిపడేసే సాంకేతిక విలువలు.. ఇలా ఒక సినిమా అనే మాధ్యమం ఇచ్చే చాలా అనుభూతులను వెంటేసుకొని వచ్చిన ఈ సినిమాలో రెండో భాగంలో మొదటి ఇరవై నిమిషాలు కాస్త నెమ్మదించడం అన్నది మాత్రమే ప్రతికూలాశం. ఒక్క మాటలో చెప్పాలంటే… సినిమా అయిపోయాక మొహంపై ఓ చిరునవ్వు మిగిల్చి, కళ్ళనుంచి చిన్నగా నీళ్ళు తెప్పించే సినిమాలు ఎప్పటికో గానీ రావు. ‘ఊపిరి’.. తెలుగు సినిమాకు కొత్తగా ఊపిరినిచ్చే అలాంటి అందమైన సినిమా.

---రివ్యూ బై విజ్ఞాన్ దాసరి

మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us

Facebook: https://www.facebook.com/Tollybeatsmedia/

Twitter: https://twitter.com/BeatsTolly

YouTube: https://www.youtube.com/channel/UCmc5YqKIfIWK5pdLCqLJv6w

Blog: http://tollybeatsmedia.blogspot.in

Google+: https://plus.google.com/u/0/112797037583980613598

Sunday, March 20, 2016

‘దృశ్యకావ్యం’ సినిమా రివ్యు


‘దృశ్యకావ్యం’ సినిమా రివ్యు


Tolly Beats Rating: 1.25/5

రామ్ కార్తిక్, కశ్మీరా కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించగా బెల్లం రామకృష్ణా రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా దృశ్యకావ్యం. తెలుగులో ఈ మధ్యకాలంలో ట్రెండ్‌గా మారిన హర్రర్ జానర్‌ను నమ్ముకొని తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ’దృశ్యకావ్యం’ లాంటి టైటిల్ పెట్టి పెద్ద సాహసమే చేసి మనముందుకు వచ్చిన ఈ సినిమా ఏ స్థాయి వరకూ ఆకట్టుకుందీ? చూద్దాం...

కథ :

అఖిల్ (రామ్ కార్తీక్), అభినయ (కశ్మీరా కులకర్ణి) కాలేజీ రోజులనుంచీ ఒకరంటే ఒకరికి ఇష్టంతో ప్రేమించుకొని పెళ్ళి చేసుకుంటారు. ఒక యాక్సిడెంట్‌లో కుటుంబం మొత్తాన్నీ కోల్పోయిన అభినయకి, అఖిల్ అన్నీ తానై చూసుకుంటూంటాడు. అఖిల్, అభినయ, వారికి పుట్టిన పాప అనన్య… వీళ్ళందరి సంతోషాలతో ఆ ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. ఇదిలా ఉండగానే, ఒకానొక రోజు అఖిల్ ఆఫీస్ పనిపై యూరప్ వెళ్తూ, ఎయిర్‌పోర్ట్‌కు వెళ్ళేదారిలోనే యాక్సిడెంట్‌లో చనిపోతాడు.

కాగా చనిపోయిన తర్వాత కూడా అఖిల్ ఆ కుటుంబంతో ఫోన్‌లో మాట్లాడుతూనే ఉంటాడు. అతడి ఇంట్లో ఏవో అదృశ్య శక్తులు తిరుగుతూంటాయి? చనిపోయిన తర్వాత కూడా అఖిల్ ఆ కుటుంబంలోనే ఎప్పట్లానే ఉంటాడు? అసలీ కథేంటీ? చనిపోయిన అఖిల్ మళ్ళీ ఎలా వచ్చాడు? ఆ ఇంట్లోని అదృశ్య శక్తులేంటీ? అన్నదే ‘దృశ్యకావ్యం’ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు ఉన్నంతలో ప్లస్ పాయింట్స్ అంటే తండ్రి-కూతుళ్ళ మధ్యన వచ్చే ఎమోషనల్ సీన్స్ గురించి చెప్పుకోవచ్చు. ‘నో ఎండ్ ఫర్ ఫీలింగ్స్’ పేరుతో ముగిసే ఈ సినిమాలో బేసిక్ ఎమోషన్ ఈ రెండు పాత్రల చుట్టూనే తిరుగుతూంటుంది. ఇక ప్రీ ఇంటర్వెల్ దగ్గర సినిమాలో వేగం పరిగి మంచి థ్రిల్ ఇస్తుంది. సెకండాఫ్‌లో సస్పెన్స్ రివీల్ అయ్యే ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు మేకింగ్ పరంగా కూడా బాగున్నాయి.

నటీనటుల పరంగా ఈ సినిమాలో అందరూ బాగానే చేశారు. ఎక్కువగా సినిమా అంతా నాలుగు పాత్రల చుట్టూ నడుస్తూంటుంది. హీరో కార్తిక్ బాగానే నటించాడు. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. కశ్మీరా గ్లామర్ పరంగా, యాక్టింగ్ పరంగా ఫర్వాలేదు. ఓ ప్రధాన పాత్రలో నటించిన మధు బాగా చేశాడు. కీలక సన్నివేశాల్లో మధు సినిమాను అన్నీ తానై నడిపించాడు. ఇక అనన్యగా నటించిన పాప బాగా చేసింది. సినిమా పరంగా చూసుకుంటే సెకండాఫ్‍లోనే అసలు కథ ఉంటుంది కాబట్టి ఈ సినిమాకు సెకండాఫ్‍నే ఉన్నంతలో ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే ఒక్క చిన్న సస్పెన్స్ ఎలిమెంట్‌తో రాసుకున్న క్లారిటీలేని కథ, కథనాల గురించే చెప్పుకోవాలి. ఫస్టాఫ్ అంతా రొమాన్స్, ఫ్యామిలీ అంశాలతో నడిచే ఈ సినిమా సెకండాఫ్ మొదలయ్యాక గానీ హర్రర్ అంశాన్ని టచ్ చేయదు. ఇక అప్పటివరకూ సినిమా ఏమాత్రం ఆసక్తికరంగా లేని సాదాసీదా సన్నివేశాలతో నడుస్తూ విసుగు పుట్టిస్తుంది. ఫస్టాఫ్‍లో తండ్రి-కూతుళ్ల మధ్యన వచ్చే సన్నివేశాలు మినహాయిస్తే ఇంటర్వెల్ వరకూ పెద్దగా ఆకట్టుకునే సన్నివేశాలేవీ లేవు. ఇక ఒక ట్విస్ట్‌ తర్వాత మొదలయ్యే సెకండాఫ్ కూడా మొదలైన వెంటనే గాడి తప్పి ఎటో వెళ్ళిపోయింది. ముఖ్యంగా ఈ క్రమంలో హర్రర్ అంశాన్ని ముడిపెడుతూ వచ్చే సన్నివేశాలతో మొదలుకొని ప్రతిదీ సిల్లీగా కనిపిస్తుంది. ఇక పాటలు కూడా ఎందుకు వస్తాయో అర్థం కాదు.

సినిమా అంతా అయిపోయాక ఏం చెప్పాలనుకున్నారో కూడా అర్థం కానంత విచిత్ర పరిస్థితికి కారణం కథనంలో బలం లేకపోవడమే అని చెప్పుకోవాలి. ఇక దీనికి తోడు ‘బాహుబలి’ సినిమా తరహాలో హర్రర్ అంశంలోని అసలు కథను ‘దృశ్యకావ్యం 2’లో చెప్తామని చివర్లో ప్రకటించడం ఈ సినిమా విషయంలో బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. అసలు అప్పటివరకూ ఏమీ లేని సినిమాలో క్లైమాక్స్‌లో అయినా ఏదైనా ఉంటుందీ అనుకుంటే ఒక్క సస్పెన్స్ ఎలిమెంట్ ఏదో చెప్పాం అనిపించి, ఇలా అకస్మాత్తుగా సినిమాను పూర్తి చేయడం నిరాశ కలిగిస్తుంది. ఫస్టాఫ్‌లో హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్, కాలేజీ ఎపిసోడ్, సెకండాఫ్‌లో నటుడు పృథ్వీ నేపథ్యంలో వచ్చే ఎపిసోడ్, హర్రర్ అంశం.. ఇవన్నీ సిల్లీగా ఉండడమే కాక పరమ బోరింగ్‌గా కూడా ఉన్నాయి. సినిమాలో లాజిక్ అన్న మాటకు సన్నివేశాల పరంగా అటుంచితే, కథ పరంగానూ ఓ అర్థం లేకపోవడం చాలాచోట్ల నవ్వు తెప్పిస్తుంది.

సాంకేతిక విభాగం :

ముందుగా దర్శక, రచయిత బెల్లం రామకృష్ణా రెడ్డి గురించి చెప్పుకుంటే.. ‘దృశ్యకావ్యం’ అన్న టైటిల్ పెట్టి ఆయన రాసుకున్న కథే మొదట్నుంచీ అర్థం లేనిది. బేసిక్ ఎమోషన్ బాగున్నా, పూర్తి కథంతా ఓ అర్థంలేని వ్యవహారంలో నడిపించి రచయితగా రామకృష్ణా పూర్తి స్థాయిలో విఫలమయ్యాడు. దర్శకుడిగానూ ఆయన ఈ సినిమాలో పెద్దగా ఆకట్టుకున్నది లేదు. ఒక్క సస్పెన్స్ ఎలిమెంట్‌ను రివీల్ చేసే సమయంలో దర్శకుడిగా ఫర్వాలేదనిపించాడు.
‘ప్రాణం’ కమలాకర్ అందించిన మ్యూజిక్ ఫర్వాలేదనేలా ఉంది. రెండు పాటలు ఫర్వాలేదనిపిస్తాయి. బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ అంతంతమాత్రమే! సంతోష్ షనమోని సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాకు మొదట్నుంచీ, చివరివరకూ ఒక ఫీల్ తేవడంలో సినిమాటోగ్రాఫర్ పనితనం చూడొచ్చు. నాగిరెడ్డి అందించిన ఎడిటింగ్ అస్సలు బాగాలేదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ మాత్రం చాలా బాగున్నాయి.

తీర్పు :

హర్రర్‌తో పాటు మరో జానర్ కలిసిరావడమనేది ఇప్పుడు బాగా నడుస్తున్న ట్రెండ్. హర్రర్ థ్రిల్లర్, హర్రర్ కామెడీ, హర్రర్ డ్రామా.. ఇలా ఈ ట్రెండ్‌ ప్రకారమే వచ్చిన ‘దృశ్యకావ్యం’, హర్రర్‍కు ఫ్యామిలీ డ్రామాను కలిపి మెప్పించాలనుకొని విఫలమైంది. అసలైన హర్రర్ ఎలిమెంట్ తేలిపోవడం, అర్థం లేని కథ, కథనం, ఎందుకెలా వస్తున్నాయో తెలియని లాజిక్ లేని సిల్లీ సన్నివేశాలు, అసలు కథను చెప్పకుండా చివర్లో పార్ట్ 2 అనడం.. ఇలా ఇన్ని మైనస్‌లతో వచ్చిన ఈ సినిమాలో మధు యాక్టింగ్, ప్రీ క్లైమాక్స్, తండ్రి-కూతుళ్ళ బేసిక్ ఎమోషన్ తప్ప మరింకేమీ లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే ‘దృశ్యకావ్యం’ అనేంత స్థాయి టైటిల్‌కి ఏమాత్రం అర్హం కాని ఈ సినిమా ఒక సాదాసీదా సినిమాగా కూడా నిలబడలేకపోయింది.
---రివ్యూ బై విజ్ఞాన్ దాసరి

మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us

Facebook: https://www.facebook.com/Tollybeatsmedia/

Twitter: https://twitter.com/BeatsTolly

YouTube: https://www.youtube.com/channel/UCmc5YqKIfIWK5pdLCqLJv6w

Blog: http://tollybeatsmedia.blogspot.in

Google+: https://plus.google.com/u/0/112797037583980613598

‘రొమాన్స్ విత్ ఫైనాన్స్’ సినిమా రివ్యు


‘రొమాన్స్ విత్ ఫైనాన్స్’ సినిమా రివ్యు

Tolly Beats Rating: 1.25/5

బాగుందన్న టాక్ వస్తే తక్కువ బడ్జెట్ సినిమాలకు ఆదరణ బాగానే కనిపిస్తోన్న నేపథ్యంలో అదే బాటలో చాలా చిన్న సినిమాలు థియేటర్లకు వచ్చేస్తున్నారు. తాజాగా అలా వచ్చిన మరో చిన్న బడ్జెట్ సినిమాయే ‘రొమాన్స్ విత్ ఫైనాన్స్’. ఈ రోజే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం..

కథ :

ఈ సినిమా కథ విషయానికొస్తే చాలా సాధారణమైన కథ. జై (సతీష్ బాబు) అనే కాలేజీ కుర్రాడు చైత్ర (మెరీన అబ్రహం) అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. కాలక్రమంలో చైత్ర కూడా జైను ఇష్టపడుతుంది. అలా వీళ్ళిద్దరూ హాయిగా గడుపుతున్న సమయంలో మంచి టైమ్ చూసుకుని జై చైత్రకు తన ప్రేమను చెబుతాడు. కానీ విచిత్రంగా చైత్ర అతని ప్రేమను కాదంటుంది.
జైను అంతగా ఇష్టపడ్డ చైత్ర అతని ప్రేమనెందుకు కాదంది..? జై తో చైత్రకున్న సమస్యేంటి..? ఆ సమస్యలన్నింటినీ దాటుకుని జై, చైత్ర ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :
సినిమా మొత్తానికి పెద్ద ప్లస్ పాయింట్ అంటే హీరోయిన్‌గా చేసిన ‘మెరీన అబ్రహం’ అనే చెప్పాలి. డీసెంట్ గా కనిపిస్తూ ఆమె చేసిన నటన బాగుంది. కాలేజ్ లో అమెపై వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలను బాగా చూపించారు.

ఇక ఆశ్చర్యంగా ఈ సినిమా సంగీతం కూడా బాగానే ఉంది. ఇంటర్వెల్ సన్నివేశాలకు సంగీత దర్శకుడు అందించిన సంగీతం బాగానే వర్కవుటైంది. హీరో స్నేహితుడి పాత్రలో నటించిన వ్యక్తి తన పాత్రకు న్యాయం చేశాడు.


మైనస్ పాయింట్స్ :

సినిమాకి ప్రధానమైన కథ లేకపోవడమే ఈ సినిమాలో పెద్ద మైనస్ పాయింట్. హీరో హీరోయిన్‌కు ప్రపోజ్ చేయడం, హీరోయిన్ సిల్లీ కారణం వల్ల అతని ప్రేమను రిజక్ట్ చేయడం, పైగా ఆ సిల్లీ కారణం కూడా బాగా విసుగు పుట్టే సమయంలో రివీల్ చేయడం అనేవి ప్రేక్షకులకు అసహనాన్ని తెప్పిస్తాయి.

సినిమాకి తీసుకున్న అంశం చాలా చిన్నది. ఎంత చిన్నదంటే ఓ షార్ట్ ఫిల్మ్ తీయడానికి కూడా సరిపోనంత చిన్నది. ఆఖరి 10 నిముషాలు మినహాయిస్తే మిగతా సినిమాలో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. హీరో హీరోయిన్ల మధ్య ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా కెమిస్ట్రీ అస్సలు వర్కవుట్ కాలేదు. సినిమా రెండవ భాగంలో హీరోయిన్ పాత్రను ఎందుకు తగ్గించారో అర్థం కాదు. హీరో హీరోయిన్లు నటనలో ఇంకా శిక్షణ తీసుకోవాల్సి ఉంది. హీరో తన పాత్రకు చెప్పుకున్న డబ్బింగ్ కూడా ఘోరంగా ఉంది.


సాంకేతిక విభాగం :

ముందుగా చెప్పినట్టు సంగీతం బాగుంది. అన్ని పాటలనూ బాగానే కంపోజ్ చేశారు సంగీత దర్శకుడు. నిర్మాణ విలువలు ఫరవాలేదనిపించాయి. విజువల్స్ పరంగా చూసుకుంటే కెమెరా పనితనం బాగుంది.
ఇక దర్శకుడు రాజు కుంపట్ల కథ చెప్పిన విధానం భయంకరంగా ఉంది. కథాంశం చిన్నదే అయినప్పటికీ దానికి కాస్త ఎంటర్టైన్మెంట్ జోడించి కథ చెప్పుండాల్సింది. కానీ దర్శకుడు అలా చేయకుండా కథని సాగదీస్తూ పాత్రలను నడిపిన విధానం ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుంది.

తీర్పు :

‘రొమాన్స్ విత్ ఫైనాన్స్’ అనే ఈ సినిమా ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో కెల్లా అర్థం లేని, సాగాదీయబడ్డ సినిమా. హీరోయిన్ మెరీన అబ్రహంను మినహాయిస్తే మిగిలిన కథాంశం, పాత్రలు, కథను చెప్పిన విధానం అన్నీ కలగాపులగంగా ఉండి ప్రేక్షకులను కన్ఫ్యూజన్ లో వదిలేస్తాయి. థియేటర్లకు వెళ్లి కాదు కదా టీవీల్లో వేసినా కూడా ఈ సినిమాను చూడనవసరం లేదు.

---రివ్యూ బై విజ్ఞాన్ దాసరి

మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us

Facebook: https://www.facebook.com/Tollybeatsmedia/

Twitter: https://twitter.com/BeatsTolly

YouTube: https://www.youtube.com/channel/UCmc5YqKIfIWK5pdLCqLJv6w

Blog: http://tollybeatsmedia.blogspot.in

Google+: https://plus.google.com/u/0/112797037583980613598

Saturday, March 19, 2016

‘కథకళి’ సినిమా రివ్యు || Tolly Beats


‘కథకళి’ సినిమా రివ్యు || Tolly Beats



Tolly Beats Rating: 2.25/5

తెలుగు, తమిళ భాషల్లో యాక్షన్, కుటుంబ కథా చిత్రాలతో అందరికీ దగ్గరైన హీరో విశాల్, తాజాగా ‘కథకళి’ అనే థ్రిల్లర్‌తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళనాట జనవరి నెల్లోనే పొంగల్ కానుకగా విడుదలైన ఈ సినిమాకు తెలుగులో ఇప్పటికి సరైన రిలీజ్ దొరికింది. జాతీయ అవార్డు పొందిన దర్శకుడు పాండిరాజ్ తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ నిజంగానే థ్రిల్ చేసేలా ఉందా? చూద్దాం..

కథ :

అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉండే కమల్ (విశాల్), ప్రేమించిన అమ్మాయి మల్లీశ్వరి (క్యాథరిన్)ని పెళ్ళి చేసుకోవడం కోసం సొంత ఊరైన కాకినాడ వస్తాడు. అతడి పెళ్ళికి సంబంధించిన పనులు జరుగుతున్న కాలంలోనే, అదే ఊర్లో ఉండే సాంబ (మధుసూదన రావు) అనే జాలర్ల సంఘం అధ్యక్షుడు హత్య కాబడతాడు. కాకినాడలో తానే అన్ని దందాలూ చేయాలనుకునే సాంబకు, కమల్ కుటుంబానికి గతంలో ఓ గొడవ జరిగి ఉండడంతో సాంబ హత్య విషయమై పోలీసులు కమల్‌ని కూడా అనుమానిస్తారు. ఓ చిన్న సంఘటన ఈ అనుమానాన్ని బలపరుస్తుంది.
ఇక అక్కడినుంచి మొదలైన అసలు కథ ఏయే మలుపులు తిరిగిందీ? సాంబను ఎవరు హత్య చేశారు? కమల్ అన్నయ్యే సాంబను చంపాడా? సాంబకు, కమల్ కుటుంబానికి మధ్యన జరిగిన గొడవేంటీ? పెళ్ళికి సిద్ధమవుతోన్న తరుణంలో వచ్చిన ఇన్ని ఇబ్బందులను కమల్ ఎలా ఎదుర్కొన్నాడూ? లాంటి ప్రశ్నలకు సమాధానమే ‘కథకళి’.

ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే ఒక సస్పెన్స్ ఎలిమెంట్‌ను మొదట్నుంచీ, చివరివరకూ ఎక్కడా పడిపోకుండా రకరకాల సంఘటనలకు సరిగ్గా కలుపుతూ అల్లుకున్న స్క్రీన్‌ప్లే స్టైల్ గురించి చెప్పుకోవచ్చు. ఒక చిన్న పాయింట్‌నే రెండు గంటల సినిమాగా చెప్పడంలో ఈ స్క్రీన్‌ప్లే స్టైల్‌దే కీలక పాత్ర అని చెప్పుకోవాలి. సినిమాలో పగ అనే అంశాన్ని రెండు కోణాల్లో చూపిస్తూ చివర్లో గానీ అసలు కోణాన్ని బయటపెట్టకుండా చేసిన ప్రయత్నం చాలా బాగుంది. సెకండాఫ్‌లో ఫ్యామిలీ ఎమోషన్‌ను కథతో పాటు నడిపిన విధానం కూడా బాగా ఆకట్టుకుంటుంది. థ్రిల్లర్ నెరేషన్‌ను పక్కదారి పట్టించకుండా సెకండాఫ్‌ను నడపడంతో సినిమా మంచి వేగంతో నడుస్తుంది. ‘కథకళి’ అన్న పేరేందుకు పెట్టారన్నది కూడా చివరివరకూ తెలియనీయక పోవడం బాగుంది.

హీరో విశాల్ చాలా సహజంగా ఎక్కడా అతికి పోకుండా పాత్ర పరిధిలోనే ఉండే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఆ పాత్రను తయారు చేసిన విధానం కూడా బాగుంది. క్యాథరిన్ థ్రెసా క్యూట్‌గా బాగుంది. విలన్‌గా మధుసూదన్ రావు చాలా బాగా చేశాడు. మిగతా నటీనటులంతా తమ పరిధి మేర బాగానే నటించారు. సినిమా పరంగా చూసుకుంటే ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ట్విస్ట్.. ఇలా సినిమా పతాక సందర్భాలన్నిచోట్లా మంచి థ్రిల్స్ ఇస్తుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే కథ చాలా చిన్నది కావడం గురించి చెప్పుకోవాలి. ఇంత చిన్న కథను సినిమాగా చెప్పడంలో మంచి స్క్రీన్‌ప్లే సహకారం తీసుకున్నా అసలు కథలోనే ఇంకాస్త ఎమోషన్ ఉంటే బాగుంటుందనిపించింది. ఇక హీరో, హీరోయిన్ల లవ్‌ట్రాక్ కూడా సాదాసీదాగా ఉంది. ఈ ఎపిసోడ్ కొంత ఓవర్ కూడా అయింది. ఇక ఫస్టాఫ్‌లో అసందర్భంగా వచ్చే పాటలు కూడా సినిమా మూడ్‌ను దెబ్బతీశాయి. ముఖ్యంగా ఇంట్రో సాంగ్ అవసరమే లేదని చెప్పొచ్చు.

క్లైమాక్స్ ఫైట్ కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేదు. అదే విధంగా చివర్లో ఎండ్ కార్డ్ వద్ద వచ్చే ట్విస్ట్ సినిమాకు ఒకరకంగా ప్లస్ కాగా, అదే ప్లస్ మన సినిమా ఇంకా మూస ధోరణినే నమ్ముకుందన్న ఫీలింగ్ కలిగించేలా ఉంది. సినిమా కథలో రకరకాల ట్విస్ట్‌లు పరిచయమవుతున్న క్రమంలో కొన్నిచోట్ల లాజిక్‌ను పక్కన పెట్టేశారన్నది స్పష్టంగా కనిపిస్తుంది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా కథకళి ఉన్నతంగా ఉంది. ఒక చిన్న కథను రెండు గంటల సినిమాగా మలచడంలో దర్శక, రచయిత పాండిరాజ్ ప్రతిభను అభినందించాలి. ముఖ్యంగా ఈ సినిమాలో స్క్రీన్‌ప్లే పరంగా ఆయనకు ఎక్కువ మార్కులు వేయొచ్చు. లవ్‌ట్రాక్ విషయంలో, ఉపకథలను పెట్టడం విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేదినిపించినా, దర్శకుడిగా మాత్రం పాండిరాజ్ మేకింగ్ పరంగా చాలాచోట్ల ప్రయోగాలు చేసి మెప్పించారు.
ఇక హిపాప్ థమిజా అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు అంతంతమాత్రమే ఉన్నా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో హిపాప్ థమిజా ప్రతిభను బాగుంది. బాలసుబ్రమణ్యం సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా రాత్రి సన్నివేశాల్లో ఆయన చేసిన ప్రయోగం కట్టిపడేస్తుంది. ఎడిటింగ్ బాగుంది. విశాల్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన గత సినిమాల్లానే ఈ సినిమాకూ ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

తీర్పు :
విశాల్ సినిమాలు ఎక్కువగా కుటుంబ నేపథ్యంతో ముడిపడి ఉన్న యాక్షన్ ఎంటర్‍టైనర్సే అయి ఉంటాయి. ‘కథకళి’ కూడా అందుకు మినహాయింపేమీ కాకపోయినా, ఇక్కడ ఫ్యామిలీ ఎమోషన్‌ను ఉపకథగానే ఉంచి ప్రధాన కథైన మర్డర్ మిస్టరీకి దీన్ని ముడిపెట్టడమే బాగా ఆకట్టుకునే అంశం. ఒక పూర్తి స్థాయి థ్రిల్లర్‌కు సరిపడే కథ కాకపోయినా, బోర్ కొట్టించని కథనం, సినిమాకు కీలకమైన సందర్భాల్లో మంచి థ్రిల్స్‌తో కొన్ని ట్విస్ట్‌లు ఉండడం, అన్నింటికీ మించి క్లైమాక్స్ ట్విస్ట్ లాంటివి ఈ సినిమాకు హైలైట్స్‌గా చెప్పుకోవచ్చు. ఇకపోతే, పూర్తిగా ఒకే పాయింట్‌పై నడిచినట్టు కనిపించే కథ, అక్కడక్కడా అవసరం లేని సన్నివేశాలు, అసందర్భమైన పాటలు, పెద్దగా ఆకట్టుకోని లవ్‌ట్రాక్ లాంటివి మైనస్‍లుగా చెప్పుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే.. పెద్దగా అంచనాలేవీ లేకుండా వెళితే ఈ థ్రిల్లర్‌ను ఓసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు. థ్రిల్లర్ అనగానే దానికంటూ పెట్టుకునే అంచనాలతో వెళితే మాత్రం నిరాశే!

---రివ్యూ బై విజ్ఞాన్ దాసరి

మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us

Facebook: https://www.facebook.com/Tollybeatsmedia/

Twitter: https://twitter.com/BeatsTolly

YouTube: https://www.youtube.com/channel/UCmc5YqKIfIWK5pdLCqLJv6w

Blog: http://tollybeatsmedia.blogspot.in

Google+: https://plus.google.com/u/0/112797037583980613598

‘చిక్కడు దొరకడు’ సినిమా రివ్యు || Tolly Beats


‘చిక్కడు దొరకడు’ సినిమా రివ్యు || Tolly Beats


Tolly Beats Rating: 4.25/5
ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలతో మెప్పించి హీరోగా స్టార్‌డమ్ కొట్టేసిన సిద్ధార్థ్, గత కొద్దికాలంగా పూర్తిగా తమిళ సినిమాలకే పరిమితమైపోయారు. ఈ సమయంలో ఆయన తమిళంలో చేసిన ‘జిగర్‌తండా’ అనే సినిమా సూపర్ హిట్‌గా నిలిచి సిద్ధార్థ్‌‌ని తమిళంలోనూ స్టార్‌ని చేసింది. 2014లో తమిళంలో వచ్చిన ఈ సినిమాను అప్పట్నుంచే తెలుగులోనూ డబ్ చేయాలని ప్లాన్ చేస్తూ వస్తున్నా, చివరికది ఇప్పటికీ సాధ్యమైంది. ‘చిక్కడు దొరకడు’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జిగర్‌తండా’ ఎలా ఉందీ? చూద్దాం..

కథ :

కార్తీక్ (సిద్ధార్థ్) సినీ దర్శకుడవ్వాలని కలలుగనే ఓ యువకుడు. అవకాశాల కోసం పలు ప్రొడక్షన్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూండే సమయంలోనే అతడికి, ఓ నిర్మాత ద్వారా గ్యాంగ్‌స్టర్ కథైతే తప్పక చేస్తానని, అలాంటి కథ ఉంటే చూడమనే సమాధానం వస్తుంది. దీంతో కార్తీక్, ఓ గ్యాంగ్‌స్టర్ కథను తయారుచేసే పనిలో పడతాడు. ఈ క్రమంలోనే అతడికి ఎటాక్ శేషు (బాబీ సింహా) అనే రౌడీ గురించి తెలుస్తుంది. ప్రాణాలు తీయడమనేది పెద్ద విషయమే కాదనుకునే శేషు పూర్తి కథ తెలుసుకునేందుకు కార్తీక్ కర్నూలు ప్రయాణమవుతాడు.

అక్కడికి చేరుకున్నాక కార్తీక్, శేషు కథను తెలుసుకోవడానికి ఏమేం చేశాడు? శేషు పూర్తి కథ ఎలా తెలుసుకున్నాడూ? తెలుసుకొని ఆ కథతో సినిమా తీశాడా? ఆ సినిమా ఏమైంది? కర్నూలులో కావ్య (లక్ష్మీ మీనన్) అనే అమ్మాయిని ప్రేమించిన కార్తీక్ ప్రేమకథ ఏమైంది? ఇలాంటి ప్రశ్నలకు ఆసక్తికర సమాధానమే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే ఓ బలమైన కొత్తదనమున్న కథను, ఎక్కడా పడిపోకుండా, పూర్తిగా డిఫరెంట్ కామెడీతో తెరకెక్కించాలన్న ఆలోచన, ఆ ఆలోచనను పూర్తి స్థాయి సినిమాగా మార్చగలగడంలో చూపిన ప్రతిభ గురించి చెప్పుకోవచ్చు. ఇప్పటివరకూ చూడని కొత్త తరహా కథాంశమే కాకుండా, కొత్తదనమున్న కామెడీని కూడా ఈ సినిమాలో చూడొచ్చు. కొన్ని సన్నివేశాలైతే కామెడీలో కూడా ఇంత కొత్తదనం చూపించొచ్చా అన్నట్టుగా ఉన్నాయి. ఇక ఈ స్థాయిలో కామెడీ ఉంటూనే, ఒక సినిమాకు అవసరమైన ఎమోషన్‌ను మిస్ చేయకపోవడం, అదీ కథలో సరిగ్గా కలిసిపోయి ఉండడం కట్టిపడేసే అంశంగా చెప్పుకోవచ్చు.

పాత్రల చిత్రణ కూడా ఈ సినిమాకు మరో హైలైట్‌గా చెప్పుకోవచ్చు. శేషు పాత్ర సినిమాకే మేజర్ హైలైట్. ఇలాంటి భయానక పాత్రతో ఈ రేంజ్‌లో నవ్వించొచ్చా అన్నట్లుగా కొన్ని సన్నివేశాలున్నాయి. ముఖ్యంగా ఆ పాత్రలో నటించిన బాబీ సింహా నటన గురించి ఎంతచెప్పుకున్నా తక్కువే! అతడు కనిపించే ప్రతీ ఫ్రేం కట్టిపడేసేలా ఉంది. హీరో సిద్ధార్థ్ తన పాత్రను అలవోకగా చేసుకుపోయాడు. ఇక లక్ష్మీ మీనన్ కూడా చాలా బాగా చేసింది. మిగతా పాత్రధారులంతా ఎవరికి వారే తమ పాత్రల్లో బాగా నటించారు.

సినిమా పరంగా చూసుకుంటే, ఈ సినిమాకు ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ కార్డ్ పడేవరకూ వచ్చే సన్నివేశాలను హైలైట్‌గా చెప్పుకోవచ్చు. ఈ ఎపిసోడ్‌లో మేకింగ్ పరంగా చూపిన ప్రతిభ అద్భుతమనే అనాలి. ఇక సెకండాఫ్‌‌ మొత్తం పూర్తి స్థాయిలో నవ్విస్తూ ఎప్పటికప్పుడు కొత్తగా మెప్పిస్తూ నడుస్తుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ చాలా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే సినిమా మొత్తం పూర్తిగా ఒక ప్రత్యేక మూడ్‌ను కలిగి ఉండడాన్ని చెప్పుకోవచ్చు. ఈ తరహా సినిమాలు తెలుగులో చాలా తక్కువ. పూర్తిగా కమర్షియల్ సినిమాలనే ఇష్టపడేవారికి ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు. అదేవిధంగా ఫస్టాఫ్‌లో ఇంటర్వెల్‌కి ముందు, సెకండాఫ్‌లో వచ్చే మాస్టర్-స్టూడెంట్ ఎపిసోడ్ కొంత బోరింగ్ అనిపించాయి. కొన్నిచోట్ల లాజిక్‌లను పక్కనపెట్టేశారు. ఇకపోతే తెలుగు డబ్బింగ్ విషయంలో విజువల్స్ పరంగా అన్ని మార్పులూ చేసుకున్నా, ప్రధాన పాత్రలకు తప్పించి డబ్బింగ్ విషయంలో జాగ్రత్త పడినట్లు కనిపించలేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా ఈ సినిమా అన్నివిధాలా ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ముందుగా దర్శక, రచయిత కార్తీక్ సుబ్బరాజు గురించి మాట్లాడుకుంటే.. ఒక కొత్త కథను ఎంచుకొని, దానికి మరింత కొత్తదనమున్న సన్నివేశాలను పేర్చి, కావాల్సినంత ఎమోషన్‌ను సినిమా మొత్తం నిలబెడుతూనే చివరివరకూ నవ్వించేలా కార్తీక్ రాసుకున్న స్క్రీన్‌ప్లేను అభినందించకుండా ఉండలేం! దర్శకుడిగానూ ప్రతీ పదినిమిషాలకు ఓ ప్రయోగంతో కార్తీక్ కట్టిపడేశాడు. ఇలాంటి ప్రయోగాలన్నీ కలిపి సినిమాకు ఒక ఫ్రెష్ ఫీలింగ్ తెచ్చిపెట్టాయి. ఏదో కొత్త విషయం చెప్పాలన్న ఆరాటం ప్రతీ ఫ్రేం‍లో కనిపిస్తూంటుంది.

గేవ్ మిక్ యూ ఆరి సినిమాటోగ్రఫీ సినిమా మూడ్‌ను సరిగ్గా క్యారీ చేసింది. ముఖ్యంగా క్లైమాక్స్, ఇంటర్వెల్ సన్నివేశాల్లో సినిమాటోగ్రాఫర్ ప్రతిభ చాలా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ పాటలు ఫర్వాలేదు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అద్భుతంగా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో చాలాచోట్ల ప్రయోగాలున్నాయి. వివేక్ హర్షణ్ ఎడిటింగ్‌కి ఎక్కడా వంక పెట్టలేం. ఎడిటింగ్ పరంగానూ సినిమాలో చాలాచోట్ల ప్రయోగాలు చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ వర్క్ ఫర్వాలేదనేలా ఉంది. వెన్నెల కంటి అందించిన మాటలు బాగున్నాయి.

తీర్పు :

కామెడీ అనేది సీజన్, ట్రెండ్‌తో సంబంధం లేని ఓ బలమైన జానర్! ఆ జానర్లో ఎన్ని సినిమాలు వచ్చినా, ఆకట్టుకునేలా ఉందన్న ఒక్క మాట చాలు.. సినిమాను ఏ స్థాయికైనా తీసుకెళుతుంది. అలాంటి కామెడీకి కొత్తదనం, పెద్దగా ఎప్పుడూ చూడని నేపథ్యం కలిపి చేసిన ప్రయోగమే ‘చిక్కడు దొరకడు’. బాబీ సింహా అద్భుతమైన నటన, సిద్ధార్థ్ బ్రాండ్, డిఫరెంట్ కామెడీ, కొత్త కథ, నేపథ్యం, ఆలోచన.. ఇలా ఇన్ని ప్లస్ పాయింట్స్ నింపుకున్న ఈ సినిమాలో ఫస్టాఫ్‌లో ఇంటర్వెల్‌కి ముందు కొన్ని బోర్ కొట్టించే సన్నివేశాలు, సెకండాఫ్‌లో కొన్నిచోట్ల రిపీట్ అయినట్లనిపించే సన్నివేశాల్లాంటివి మైనస్‌లుగా చెప్పుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఏదైనా కొత్తగా చెప్తే చూడాలనుకునేవారికి ఈ సినిమా విపరీతంగా నచ్చుతుంది. సాధారణ సినిమాగా చూసినా కూడా మెప్పిస్తుంది.
చివరిమాట : ఎప్పుడో రెండు సంవత్సరాల క్రిందట విడుదలైన ఈ సినిమా, ఇన్నాళ్ళకు తెలుగులో, అదీ డబ్బింగ్ వర్క్‌లో కొంత అలసత్వం చూపించి, ఏమాత్రం క్రేజ్ లేకుండా ప్రేక్షకుల ముందుకు రావడమే అన్నింటికీ మించి ఈ సినిమాకు ప్రతికూలంగా కనిపించే అంశం!

---రివ్యూ బై విజ్ఞాన్ దాసరి

మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us

Facebook: https://www.facebook.com/Tollybeatsmedia/

Twitter: https://twitter.com/BeatsTolly

YouTube: https://www.youtube.com/channel/UCmc5YqKIfIWK5pdLCqLJv6w

Blog: http://tollybeatsmedia.blogspot.in

Google+: https://plus.google.com/u/0/112797037583980613598

Thursday, March 17, 2016

"రీమెక్స్" చేయబోతున్న పూరి - కళ్యాణ్... !!!


"రీమెక్స్" చేయబోతున్న పూరి - కళ్యాణ్... !!!


పూరి జగన్నాధ్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ ఫేమ్ మెహరీన్ హీరోయిన్‌గా నటించనున్న ఈ సినిమాకి ‘రీమెక్స్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మరోవైపు చిత్రబృందం మాత్రం అదేంలేదంటూ అచ్చమైన తెలుగు టైటిల్‌నే త్వరలో ప్రకటిస్తాం అని చెబుతున్నారు. ఇదిలా ఉంటే మేలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవనుంది. ప్రస్తుతం ‘రోగ్’ సినిమాని తుది దశకు తీసుకొచ్చిన పూరి కళ్యాణ్ రామ్ సినిమా స్క్రిప్ట్‌నీ పూర్తి చేసేసారట. మేలో షూటింగ్ ఆరంభించి దసరాకి సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మించనున్నారు.

మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us






Ex War turns into LEGAL WAR


Ex War turns into LEGAL WAR

Recently, Bollywood actress Kangana Ranaut, who is known for her straight forward attitude, had sparked up the controversy of her secret love affair with actor Hrithik Roshan by calling him ‘silly ex’. Now, the cold war between the exes has took a ugly turn after they slapped each other with legal notice.

Hrithik Roshan & Kangana Ranaut’s Ex war becomes uglier. They are now making shocking revelations about each other and making their personal secrets public. It all started after the vague comment of Kangana Ranaut about a certain ex.  Kangana reacted on Hrithik’s Pope tweet and Hrithik responded to it philosophically but then there was silence. “Hrithik Roshan & Kangana Ranaut’s Relationship Is Now Complicated. ”

But Hrithik has gone ahead and sent out a legal notice to Kangana through his lawyer. Apparently, he wants her to render an apology from Kangana for defaming him like she did. He has promised to make her interactions with him public if she fails to hold up a press conference and clarify that it was not Hrithik she was talking about.

Kangana has not taken this with silence, she has retaliated with a legal notice too. Her lawyer has responded to Hrithik’s notice with a 21-page reply, charging him with intimidation and threat under sections of the Indian Penal Code.


However, none of them admitted their relationship ever up to this date, but Kangana’s revelation set the media abuzz and the rumors continued to fill the air. Well, now the speculations and nasty fight in their sour relationship and its future outcome has reached the height in recent times.

According to recent reports, the lawyers of both the parties have spilled the secret and the actual truth behind their secret relationship. When a leading daily got in touch with the lawyers of both parties, the real truth came out. Reportedly, Hrithik’s legal notice claims that Kangana suffers from Asperger’s syndrome while Kangana’s notice claims that Hrithik has his own mental illness.

In his legal notice, Hrithik Roshan also asked the actress to make an apology by calling a press conference. In addition to it, Bang Bang actor has also accused Kangana for sending him 1, 439 personal and absurd mails.

In reference to claims made by Hrithik against Kangana about sending him 50 mails per day, here’s an excerpt from Kangana’s legal notice.

“Your client (Hrithik) has claimed to having received 50 emails a day from the day Kangana got to know of the correct email id till the date of sending the notice. This totals to 601 days and therefore there should have been 30,000 mails as opposed to 1,439 mails claimed in the notice. This fact further proves the exaggeration and false claims made by your client.”

“It is pertinent to record that your client throughout supported my client and fully involved her; he also did not make any attempt to block her. There is no communication from him to my client objecting to any emails. This proves that he received the emails with his participation and consent,” the notice says.

For More Information
LIKE, FOLLOW & SUBSCRIBE us





సెంటిమెంట్ని నమ్ముకున్న "బ్రహ్మొత్సవం"...!!!

సెంటిమెంట్ని నమ్ముకున్న "బ్రహ్మొత్సవం"...!!!


"బాహుబలి" తెలుగు వాడి పేరును ప్రపంచనికి పరిచయం చేసింది. ఆ సినిమా పాటలు తిరుపతి లొ విడుదల అవ్వి ఘన విజయం సాదించిన సంగతి విదితమే...

ఐతే ఎప్పుడు, మహేష్ బాబు కధానాయకుడిగా రాభోతున్న సినిమా "బ్రహ్మొత్సవం" కూడా తిరుపతి లొ విడుదల చేయడానికి నిర్ణయించారు. శ్రికంత్ అడ్డల దర్శకత్వంలో మహేష్ బాబు, సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత సుభాష్, రాకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న "బ్రహ్మొత్సవం" పాటలను ఏప్రిల్ 10న విడుదల చేయనున్నారు. 
మిక్కీ జె మేయర్ ఈ సినిమాకి సంగీతం అందించగా పివిపి సంథ నిర్మిస్తుంది.


---రవి కిరణ్ మాదినీడి

మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us







Monday, March 14, 2016

భామలను భయపెడుతున్న భల్లాలదేవుడు...

భామలను భయపెడుతున్న భల్లాలదేవుడు
             బాహుబలిలో విలన్ భల్లాలదేవుడు రానా సినిమాలో చాలా గంభీరంగా ఉండి మ‌హిష్మీతి రాజ్యంలో ప్ర‌జ‌ల‌తో పాటు సినిమా చూసే వారిని భ‌య‌పెట్టేస్తాడు. కానీ రియ‌ల్ లైఫ్‌లో మాత్రం రానా చాలా అల్ల‌రి చిల్ల‌రి పిల్ల‌గాడ‌ట‌. ఎప్పుడూ ఎవ‌రో ఒక‌రిని ఆట‌ప‌ట్టించ‌నిదే మ‌నోడికి నిద్ర‌ప‌ట్ట‌ద‌ట‌. చాలా ఆడియో ఫంక్ష‌న్ల‌లో కూడా రానా చాలా మంది హీరోల‌ను, హీరోయిన్ల‌ను అల్ల‌రి పెడుతుంటాడు. అయితే రీసెంట్‌గా హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఓ ర్యాంప్‌వాక్‌లో ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు సెల్ఫీలు తీసుకుంటుంటే మ‌నోడి వాళ్లిద్ద‌రి మ‌ధ్య‌లో దూరిపోయాడ‌ట‌.

ఓ ఛారిటీ కోసం ఏర్పాటు చేసిన షోకు రాణా కూడా హాజరయ్యాడు. ఆ సమయంలో ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లైన సోనాల్ చౌహాన్‌, ప్ర‌గ్యా జైశ్వాల్ సెల్ఫీలు తీసుకుంటుంటే ఇలా చివరి నిమిషంలో మధ్యలో దూరిపోయి ఫోటోలో ఇరుక్కున్నాడు. ఇద్దరు ముద్దుగుమ్మల మధ్యలో చిక్కిపోయాడు. దీంతో ఆ ఇద్ద‌రు క‌లిపి మ‌నోడిని ఓ ప‌ట్టు ప‌డ‌దామ‌నుకున్నార‌ట‌. రానా త‌మ మ‌ధ్య‌లో దూరేందుకు వాళ్లిద్ద‌రు సందు ఇవ్వ‌క‌పోవ‌డంతో చివ‌ర‌కు న‌లుగుతూనే వాళ్ల మ‌ధ్య‌లో దూరిపోయాడు. ఈ ఫొటో చూస్తే అది మీకే అర్థ‌మ‌వుతుంది. గతంలో ఇతగాడి స్పీడ్ ఇంకా ఎక్కువగా ఉండేదట. కపుల్స్ మధ్యలో కూడా దూరిపోయేవాడట‌.
---రవి కిరణ్ మాదినీడి


మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us






Saturday, March 5, 2016

‘శౌర్య’ సినిమా రివ్యు || Tolly Beats

‘శౌర్య’ సినిమా రివ్యు  || Tolly Beats

Tolly Beats Rating: 2.75


హీరోగా డిఫరెంట్ సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంచు మనోజ్ హీరోగా కుటుంబ కథా చిత్రాల దర్శకుడు దశరథ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘శౌర్య’. ఒక ప్రేమకథకి థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ ని మిక్స్ చేసి చేసిన ఈ సినిమాలో రెజీన కసాండ్ర హీరోయిన్. ‘సూర్య vs సూర్య’ తర్వాత మల్కాపురం శివకుమార్ నిర్మించిన సరికొత్త థ్రిల్లర్ ఎంత వరకూ తెలుగు ప్రేక్షకులను థ్రిల్ చేసింది అనేది చూద్దాం..

కథ :
ఈ చిత్ర టీం ముందు నుంచి ప్రమోట్ చేస్తున్నట్టు.. ‘జరిగిన ప్రతి సంఘటన వెనుక మూడు కథలుంటాయి.. ఒకటి జనాలు ఊహించేది, రెండు చేసినవాడు చెప్పేది, మూడు వాస్తవంగా జరిగేది’ అనే కాన్సెప్ట్ చుట్టూనే ఈ సినిమా తిరుగుతుంది. ఇక అసలు కథలోకి వెళితే.. శౌర్య(మంచు మనోజ్) – నేత్ర(రెజీన కసాండ్ర) ప్రేమించుకుంటారు. కానీ ఎప్పటిలానే పెద్దల నుంచి సమస్య రావడంతో పారిపోవాలని డిసైడ్ అయ్యి, దేశం వదిలి వెళ్లిపోవాలని ప్లాన్ చేసుకుంటారు.

ఎలాగో దేశం వదిలి వెళ్ళిపోతున్నాం కదా అని చివరి రోజు శివరాత్రి కావడం వలన శివాలయంలో జాగారం చేయడానికి వస్తారు. కట్ చేస్తే నేత్రని చంపడానికి అటాక్ జరుగుతుంది. ఆ అటాక్ లో దాదాపు ప్రాణాలు కోల్పోయే స్టేజ్ కి వెళ్ళిన నేత్రని హాస్పిటల్ లో చేర్చి, శౌర్యని ముద్దాయిగా జైల్లో వేస్తారు. ఆ కేసు డీల్ చేయడానికి కృష్ణ ప్రసాద్(ప్రకాష్ రాజ్) రంగంలోకి దిగితాడు. అక్కడే శౌర్య ఒక ట్విస్ట్ ఇస్తాడు. ఆ ట్విస్ట్ ఏంటి? అక్కడి నుంచి కథ ఎలా మలుపులు తిరిగింది? ప్రేమించిన శౌర్యనే నేత్రని చంపాలనుకున్నాడా? లేక ఇంకెవరన్నా చంపాలనుకున్నారా? ఫైనల్ గా నేత్ర బతికిందా లేదా అన్నదే మిగిలిన థ్రిల్ చేసే కథ.

ప్లస్ పాయింట్స్ :
ఎప్పుడు కుటుంబ కథా చిత్రాలే తీస్తాడు అనే ముద్ర ఉన్న దశరథ్ ఈ సారి ప్రేమకథకి ఒక థ్రిల్లింగ్ పాయింట్ ని జత చేసి రాసుకున్న స్టొరీ లైన్ చాలా బాగుంది. ఇక సినిమాని ఒక సస్పెన్స్ తో మొదలు పెట్టి ఆడియన్స్ లో ఆసక్తిని పెంచడం బాగుంది. మనోజ్ రివీల్ చేసే ఇంటర్వెల్ ట్విస్ట్ అందరినీ థ్రిల్ చేసి, సెకండాఫ్ మీద ఆసక్తిని పెంచుతుంది. ఇక సెకండాఫ్ లో చివరి గా వచ్చే 30 నిమిషాలు సినిమాకి ఆయువుపట్టు అని చెప్పాలి. ఎందుకంటే చివరి 30 నిమిషాల్లో మొదటి నుంచి దాచి పెట్టిన ట్విస్ట్ లన్నిటినీ ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ వస్తుంటారు. అలా థ్రిల్స్ మీద థ్రిల్స్ ఇస్తూ సినిమాని ముగించడం మస్త్ అనిపిస్తుంది. మంచు మనోజ్ – ప్రకాష్ రాజ్ ల మధ్య వచ్చే కోర్టు సీన్ మరియు అక్కడ చెప్పే పులి కథ బాగుంది.

ఇక నటీనటుల విషయానికి వస్తే..మంచు మనోజ్ చూడటానికి బాగా బొద్దుగా, అమాయకుడిగా కనిపిస్తాడు. అమాయకంగా కనిపిస్తూ, ఇంటర్వెల్ లో తనలోని ఇంకో షెడ్ ని రివీల్ చేసే సీన్ మరియు అందులో మనోజ్ పెర్ఫార్మన్స్ సూపర్బ్. మనోజ్ ఎంచుకున్న పాత్రకి పూర్తి జస్టిఫికేషన్ చేసాడు. రెజీన ఈ సినిమాలో గ్లామర్ అనేది లేకుండా, చాలా హోమ్లీ లుక్ లో కనిపిస్తుంది. అలాగే నటనకు ప్రాధ్యాన్యం ఉన్న పాత్ర కావడంతో తన నటనతో కథకి న్యాయం చేసింది. ఇక సినిమాలో కీలక పాత్ర చేసిన ప్రకాష్ రాజ్ పోలీస్ ఆఫీసర్ గా అన్ని షేడ్స్ ని పర్ఫెక్ట్ గా చేసాడు. వీరు కాకుండా సాయాజీ షిండే, నాగినీడు, సుబ్బరాజులు తమ నటనతో సినిమాకి మంచి సపోర్ట్ ఇచ్చారు. ప్రభాస్ శ్రీను ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా బాగానే నవ్వించారు.

మైనస్ పాయింట్స్ :
లవ్ స్టొరీ విత్ థ్రిల్లర్ అనేది మన తెలుగు వారికి కాస్త కొత్తదైన జానర్.. ఈ జానర్ ని డీల్ చేయడం అంత ఆశా మాషీ కాదు. కానీ దశరథ్ ట్రై చేసారు, కానీ సక్సెస్ కాలేకపోయారు అనే చెప్పాలి. ఎందుకంటే లవ్, థ్రిల్స్ రెండు మిక్స్ చేయాలనే ఆలోచనలో చివర్లో వచ్చే థ్రిల్స్ బాగా రాసుకున్నారు, కానీ మిగతా పార్ట్ ని సరిగా రాసుకోలేదు. అందుకే సినిమా చాలా వరకూ బాగా బోరింగ్ గా ఉంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అయితే చాలా బోరింగ్. చాలా నిదానంగా సాగుతుంది. కథ అస్సలు ముందుకెల్లదు. మెయిన్ గా ప్రతి సినిమాలోనూ ఎఫ్ఫెక్టివ్ గా లవ్ ట్రాక్ రాసుకునే దశరథ్ ఈ సినిమాలో రాసుకోలేకపోయాడు. అందుకే ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బోరింగ్. సెకండాఫ్ స్టార్టింగ్ కూడా అదేలా బోరింగ్ గా ఉంటుంది.

ఇక ఈ సినిమాలో పాటలు సినిమాకి అస్సలు సెట్ అవ్వలేదు. మెయిన్ గా సెకండాఫ్ లో వచ్చే పాటలు సినిమా నిడివిని మరింత పెంచేస్తాయి. అందుకే సినిమా ఉన్నది రెండు గంటలే అయినా ఏదో నాలుగు గంటలు చూసిన ఫీలింగ్ వస్తుంది. మెయిన్ గా దశరథ్ సినిమాలో ఉండే ఎమోషన్స్ కూడా ఇందులో మిస్ అయ్యాయి. అలాగే రెగ్యులర్ సినిమా ఆడియన్స్ కోరుకునే ఎంటర్టైన్మెంట్ అనేది అస్సలు లేదు. డైరెక్టర్ మనోజ్ లాంటి ఎనర్జిటిక్ హీరోని తీసుకొని ఇంత సైలెంట్ పాత్ర రాసుకోవడం, అది సరిగా జనాలకి రీచ్ కాకపోవడం మరో మైనస్.

సాంకేతిక విభాగం :
మొదట మనకు తెరపై కనిపించే విజువల్స్ నుంచి మొదలు పెడితే.. మల్హర్ భట్ జోషి అందించిన విజువల్స్ సినిమాకి తగ్గట్టుగానే డీసెంట్ గా ఉన్నాయి. ఇకపోతే మ్యూజిక్ డైరెక్టర్ కె. వేదకి మొదటి సినిమా అయినా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. పాటలు రెండు బాగుంటే, మిగతావి క్యాచీగా లేవు. నేపధ్య సంగీతంతో సినిమాకి కాసింత హెల్ప్ చేసాడు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కి ఇచ్చిన మ్యూజిక్ బిట్స్ బాగున్నాయి. ఎస్ఆర్ శేఖర్ ఎడిటింగ్ సినిమా ఎండ్ లో బాగుంది, కానీ మిగతా సినిమా మాత్రం చాలా బోరింగ్ గా ఉండేలా ఎడిట్ చేసారు. ఆర్ట్ వర్క్ బాగుంది. హరి – కిషోర్ గోపు డైలాగ్స్ జస్ట్ ఓకే.

శౌర్య సినిమాకి కెప్టెన్ అయిన దశరథ్ విషయానికి వస్తే… ఎందుకున్న స్టొరీ లైన్ బాగుంది, కానీ డెవలప్ చేసుకున్న కథ బాలేదు. దాంతో దానికి రచనా సహకారం అందించిన గోపి మోహన్ కూడా సినిమాని పెద్ద బెటర్ ప్రాజెక్ట్ గా మార్చలేకపోయాడు. ఇక కిషోర్ గోపు రాసిన స్క్రీన్ ప్లే అయితే మరీ బోరింగ్ అండ్ స్లో గా నత్త నడకలా ఉండడంతో సినిమా బోరింగ్ రైడ్ అయ్యింది. కథ – కథనం ఇలా ఉన్నా దశరథ్ ఆన్ స్క్రీన్ మేజిక్ చేయగలిగి ఉంటే బాగుండేది. కానీ మేజిక్ చేయలేకపోయాడు. మెయిన్ గా ఆయన బెస్ట్ గా చూపించే ఎమోషన్స్ నే పర్ఫెక్ట్ గా చూపించలేకపోయాడు, కానీ మొదటి సారైనా థ్రిల్స్ ని మాత్రం బాగానే చూపించాడు. మల్కాపురం శివకుమార్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :
మంచు మనోజ్ – దశరథ్ కాంబినేషన్ లో వచ్చిన థ్రిల్లింగ్ లవ్ స్టొరీ ‘శౌర్య’ సినిమా థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ ని చివర్లో తన థ్రిల్స్ తో మెప్పించింది కానీ లవ్ స్టొరీ మాత్రం మెప్పించలేకపోయింది. ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటి అంటే దశరథ్ లవ్ స్టొరీ – థ్రిల్లర్ ని రెండూ మిక్స్ చేయాలనీ ట్రై చేసి, పూర్తిగా రెండింటిని జస్టిఫై చేయకపోవడమే. చివరి 30 నిమిషాలు చాలా థ్రిల్లింగ్ గా ఉండడం, సినిమా స్టార్టప్, మనోజ్ – రెజీనల పెర్ఫార్మన్స్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ అయితే.. బోరింగ్ ఫస్ట్ హాఫ్, వీక్ స్క్రీన్ ప్లే, ఎంటర్టైన్మెంట్ లేకపోవడం మేజర్ మైనస్ పాయింట్స్. ఎంటర్టైన్మెంట్ కాకుండా కాస్త స్లోగా నడిచే థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారు చూడదగిన సినిమా ‘శౌర్య’.

రివ్యూ బై విజ్ఞాన్ దాసరి

మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us

Facebook: https://www.facebook.com/Tollybeatsmedia/

Twitter: https://twitter.com/BeatsTolly

YouTube: https://www.youtube.com/channel/UCmc5YqKIfIWK5pdLCqLJv6w

Blog: http://tollybeatsmedia.blogspot.in

Google+: https://plus.google.com/u/0/112797037583980613598