Latest News

Tuesday, July 19, 2016

నవ్వుల రారాజుకి జన్మదిన శుభాకంక్షలు | 26Picturesనాలుగు దశాబ్ధాలు తెలుగుతెర రంగుల‌ ప్రపంచాన్ని... తనదైన‌ హాస్య చతురతతో అల‌రించిన ‘వన్‌ అండ్‌ ఓన్లీ కింగ్‌’ నవ్వుల రారాజుకి జన్మదిన శుభాకంక్షలు


((ఈరొజు (19-07-16) కామెడీకింగ్‌ రాజేంద్రప్రసాద్‌ బర్త్‌డే సంద‌ర్భంగా ఈ స్పెషల్‌ ఆర్టికల్‌))
=======================
ప్రొఫైల్‌
పేరు : గద్దె బాబూ రాజేంద్రప్రసాద్‌
జననం : 19 జూలై 1956
జన్మస్థలం : నిమ్మకూరు, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్‌, ఇండియా
తల్లిదండ్రులు : మాణిక్యాంబ, గద్దె వెంకట నారాయణ
చదువు : డిప్లమా ఇన్ సిరామిక్‌ ఇంజనీరింగ్‌
భార్య : విజయ చాముండేశ్వరి
కొడుకు, కోడలు: బాలాజీ, శివశంకరి
సినీ రంగప్రవేశం : బాపు చిత్రం ‘స్నేహం’
సినీ ప్రస్థానం : 4 దశాబ్దాల‌కు చేరువలో బహుముఖ ప్రజ్ఞ
చేసిన సినిమాలు : 232కి పైగా.. (తమిళంలో కొన్ని)..
హాలీవుడ్ సినిమా: క్విక్‌గన్‌ మురుగన్‌
బిరుదులు : నటకిరీటి, హాస్య కిరిటీ, కామెడీ కింగ్‌
పురస్కారం : ఆంధ్రా యూనివర్సిటీ నుంచి 1997 ఆగస్టు 27న గౌరవ డాక్టరేట్‌

అవార్డులు :
1991లో ‘పెళ్లి పుస్తకం`, 1993లో ‘మిస్టర్‌ పెళ్లాం’, 2015లో ‘మీ శ్రేయోభిలాషి’ చిత్రాలు ఉత్త‌మ చిత్రాలుగా నందులు దక్కించుకున్నాయి. ఉత్తమ నటుడిగా 1991లో ‘ఎర్ర మందారం’ సినిమాకు తొలి నంది అవార్డు ద‌క్కింది. ‘మేడమ్‌’ చిత్రానికి 1994లో నంది ప్రత్యేక జ్యూరీ అవార్డు, ‘ఆ నలుగురు’లో న‌ట‌న‌కు 2004లో ఉత్తమ నటుడిగా మరోసారి నంది అవార్డు అందుకున్నారు. ‘జులాయి’ సినిమాలో నటనకు 2013లో సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ సంస్థ ద్వారా బెస్ట్‌ యాక్టర్‌ ఇన్‌ సపోర్టింగ్‌ రోల్‌ అవార్డు చేజిక్కించుకున్నారు. 2013లో ‘ఓనమాలు’ చిత్రానికి గాను ‘బెస్ట్‌ ఔట్‌ స్టాండింగ్‌ ఆర్టిస్ట్‌’గా సినీ‘మా’ అవార్డు అందుకున్నారు.

ప్రస్తుతం : మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వ‌హ‌ణ‌..
ఆరాధ్య నటుడు : విశ్వవిఖ్యాత, పద్మశ్రీ నందమూరి తారకరామారావు
బలం : స్నేహశీలి, అందరి ఆత్మీయుడు.
తపన : తుదిశ్వాస వరకూ నటనే తపన, తపస్సు.

=====================================


‘‘ఆఫ్టర్‌ వన్ ఇయర్‌.. ఐ విల్ బి కింగ్‌’’ ఆ ఒక్క డైలాగ్‌తోనే ఆడియన్స్‌ పెదాల‌పై నవ్వులు పూయిస్తూ థియేటర్లలో హల్‌చల్‌ చేసిన కామెడీ కింగ్‌ ఆయన. కథానాయకుడి పక్కన నిల్చుని.. ఒళ్లంతా విరుచుకుని నవ్వించేందుకు నానాపాట్లు పడాల్సిన ప‌నే లేకుండా ఈ ‘తెర విదూషకుడి’ని సోలో హీరోని చేసి సైడ్‌ ట్రాక్‌లో ఉన్న కామెడీని మెయిన్‌ ట్రాక్‌లోకి తెచ్చి.. పద్నాలుగు రీళ్ల సినిమా అంతా హాస్యానికి పట్టాభిషేకం చేసిన నవ్వుల‌ రారాజు ఆయన. ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాలో ‘ఆఫ్టర్‌ వన్‌ఇయర్‌..ఐ విల్‌బీ కింగ్‌’ అంటూనే.. ‘రాజ్యాలు కనుమరుగైన ప్రస్తుత ప్రజాస్వామ్య రాజ్యంలో నిర్దేశించుకున్న ల‌క్ష్యాన్ని ముద్దాడిన ప్రతిఒక్కడూ ‘మకుటంలేని మ‌హారాజే’ అన్న పచ్చి నిజాన్ని చాటి చెప్పిన ‘హాస్య కిరీటి’ ఆయన. రీల్‌లైఫ్‌లో ఆ చిత్రంలో అన్న ఆ మాటనే రియల్‌లైఫ్‌లో అనుస‌రిస్తూ సుమారు నాలుగు దశాబ్ధాలు తెలుగుతెర రంగుల‌ ప్రపంచాన్ని తనదైన‌ హాస్య చతురతతో అల‌రించిన ‘వన్‌ అండ్‌ ఓన్లీ కింగ్‌’ ఆయన. ఆయనే..  నటకిరీటి డాక్టర్‌ గద్దె బాబూ రాజేంద్రప్రసాద్‌.


రాజేంద్రప్రసాద్‌ పేరు విన‌గానే సామాన్యుడి నుంచి ప్రైమ్‌ మినిస్టర్‌ వరకూ హృదయాల్ని ఆహ్లాదపరుచుకుంటూ ఆనందగా నవ్వుకుంటారన్నది జగమెరిగిన సత్యం. రుజువు కావాలా? ఒకప్పటి మన ప్రధాని పీవీ నర్సింహారావుగారే స్వయంగా దైనందిన ఒత్తిడిని అధిగమించేందుకు అసలైన టానిక్‌ రాజేంద్రప్రసాద్‌ సినిమాలేనంటూ కితాబిచ్చారు. అంతేనా? ఆయన సినిమాల్ని ప్రశంసిస్తూ`‘కామన్‌మేన్‌ నుంచి నా వరకూ ఆయన సినిమాలు గొప్ప రిలీఫ్‌ అని కూడా అనేశారు. ఆ ప్రధాని ప్రశంస పుణ్యమాని.. 1997లో తన నల‌భై రెండో సంవత్సరంలో ఆంధ్రా విశ్వవిద్యాయం నుంచి గౌరవ డాక్టరేట్‌ పురస్కారం అదుకోవడానికి అవకాశమిచ్చిందంటూ హాస్యకిరీటి ఆనాటి మధుర స్మృతుల్ని మనసారా గుర్తు చేసుకుంటుంటారు.

దటీజ్‌ రాజేంద్రప్రసాద్‌:
చుట్టుముట్టే సమస్య‌లు, బంధుమిత్రుతో విభేదాలు, కరెంట్‌, రెంట్‌ కష్టాలు.. చెంచాడు భవసాగరాల్ని ఈదలేక ఈదలేక ఈదుతున్న సామాన్యుడి మొద‌లుకుని.. తల‌లు పండిన వివిధ రంగాల్లో ప్రముఖులు, నిత్యం రాజకీయాల్లో మునిగితేలుతున్న నేతల‌దాకా.. మనసుని ఆహ్లాదపరుచుకుంటూ గుండె బరువు దింపుకునేందుకు ఆశ్రయిస్తున్న ఒకానొక ‘హాస్య ఔషధం’ కచ్చితంగా రాజేంద్రప్రసాద్‌ సినిమానే అంటే అతిశయోక్తి కాదేమో? చికాకు పెట్టే అంశాల‌న్నింటినీ కాస్త పక్కన పెట్టి ఎంచక్కా థియేటర్లో కూర్చోని ‘లేడీస్‌ టైల‌ర్‌’నో, ‘అప్పుల‌ అప్పారావు’నో, పేకాట పాపారావు’నో పల‌కరించామనుకోండి.. ఒళ్లంతా చక్కిలిగింత పెడ్తూ కళ్లలో నీళ్లొచ్చే వరకు కదిలికదిలి నవ్వుకోమంటారాయన. కథంతా నడిపించే హీరోగారి పక్కన హాస్యన‌టుడి ముద్రతో వెకిలి చేష్టల్తో నవ్వించే ప్రయత్నం చేసే ద్వితీయ శ్రేణి ‘తెర పౌరసత్వం’ చెర తప్పించి.. ‘కామెడీ` అనే సరికొత్త ముద్రతో హాస్యానికి ‘హీరో ఇమేజ్‌’ని కట్టబెట్టిన ఘనత కచ్చితంగా రాజేంద్రప్రసాద్‌కే దక్కుతుందన్నది టాలీవుడ్‌ చరిత్ర చెప్పే నిజం. హాస్యం ప్రధానాంశంగా పూర్తిస్థాయి సినిమాని తొలి అడుగులోనూ విజయవంతం చేయగమని ‘లేడీస్‌ టైల‌ర్‌’ సాక్షిగా నిరూపించిన అసలు సిసలైన ఆర్టిస్ట్‌ రాజేంద్రప్రసాద్‌. రియ‌ల్ హీరోయిజ‌మ్‌కి ఆయ‌న కేరాఫ్ అడ్రెస్‌.

హాస్యాన్ని అద్భుతంగా పండించగలిగే నటుడు హృదయాల్ని ద్రవించగలిగే పాత్రల్ని కూడా పోషించగల‌డనీ  చాటిచెప్పినవాడు రాజేంద్రప్రసాద్‌. అందుకే, ఆయన ఖాతాలో ‘లేడీస్‌ టైల‌ర్‌’, ‘మాయలోడు’ లాంటి సినిమాల్తోపాటు ‘ఎర్రమందారం’, ‘ఆ నలుగురు’లాంటి సీరియస్‌ సినిమాలు కూడా ఉన్నాయి.

రఘురాం కనిపించాడు:
‘‘సినిమా అంతా చూశాను. ఎక్కడైనా ఆర్టిస్ట్‌ ప్రసాద్‌ కనిపించకపోతాడా అని కాగాడా పెట్టి మరీ వెతికాను. కానీ.. రఘురాం మాత్రమే కనిపించాడు. గొప్పగా చేశావు’ అంటూ ‘ఆ నలుగురు’ సినిమా చూసి హాల్లోంచి బయటికి వచ్చిన వెంటనే బుగ్గపై ఆత్మీయంగా ఒకటి చరిచి మరీ అభినందించిన కళాతపస్వి కె.విశ్వనాథ్‌ మాట గుండె భరిణెలో గులాబీరేకుల్లా దాచుకున్నానంటూ ఆ ప్రశంసల్ని తల‌చుకుని తల‌చుకుని పరవశించిపోతుంటారు రాజేంద్రప్రసాద్‌.
తెలుగు సినిమా చరిత్ర ఉన్నంత వరకూ కామెడీ కింగ్‌గా రాజేంద్రప్రసాద్‌ పేరు ‘తెరస్థాయి’గా మిగిలే ఉంటుంది. టీవీల్లోనో, థియేటర్లలోనో ఈ ‘మాయలోడు’ తన భుజాన ఉన్న సంచిలోంచి గుప్పెడు గుప్పెడు నవ్వు బయటికి తీసి ఆడియన్స్‌ గుండెల్లోకి గురిచూసి విసిరేస్తూనే ఉంటాడు. హాయిగా నవ్వుకోవానుకునేవాళ్లకు అస‌లుసిసలైన ఆప్షన్‌` ‘రాజేంద్రప్రసాద్‌ సినిమాలే’ అన్నమాట మరెవరూ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కారణం.. ఆ మాట ‘తూర్పున సూర్యుడు ఉదయించినంత నిజం కనుక. తెలుగు సినిమా వెయ్యేళ్లు వర్థిల్లాలి..  రాజేంద్రప్రసాద్‌ సినిమాలు వెయ్యేళ్లు హాస్యప్రియుల్ని అల‌రించాలి.

చావు నుంచీ సినిమా రేవు దాకా:

హాస్యానికి ‘ఐఎస్‌ఐ’ మార్క్‌లా కనిపించే రాజేంద్రప్రసాద్‌.. ఆ స్థానానికి అంత సులువుగా చేరుకోలేదు. సినీ ఆరంగేట్రం చేయాల‌నుకునే ఆర్టిస్ట్‌ందరూ ఎదుర్కొనే సినిమా కష్టాలెన్నో అనుభవించి.. ఫ‌ల‌వ‌రించి.. ఇక, భరించలేక ఒకానొక దశలో ‘చావే శరణ్యం’ అనుకుని ఆఖరిసారిగా ఆత్మీయులందరినీ ఓసారి చూసుకోవాని డిసైడ్‌ అయిన తర్వాతే అదృష్టం ఆయన గుండె తలుపుతట్టింది. పురుగు మందు తాగి ఇక ఎన్నటికీ తిరిగిరాని లోకాల‌కు తరలిపోవాల‌నుకున్న వ్యక్తికి ఊపిరూది.. జీవితంపై ఆశలు కల్పించిన వ్యక్తి సినీ ప్రముఖుడు పుండరీకాక్షయ్య. పతాక సన్నివేశం దాకా కష్టాల్తో వేధించి వేధించి.. ‘అంతర్యామీ.. అసితి’ అని ఓ ప్రాణి అల్లాడుతున్న వేళలో.. మళ్లీ బతుకిచ్చి బతికించే దేవదేవుడి లీల‌లు మన చిత్రాల‌ కన్నా గొప్ప చిత్రాల‌ని చెప్తుంటారు హాస్యకిరీటీ రాజేంద్రప్రసాద్‌.

‘రామరాజ్యంలో భీమరాజు’లో అవకాశం

ఎస్పీ వెంకన్నబాబు సినిమా ‘రామరాజ్యంలో భీమరాజు’లో తెరపై కనిపించే చిన్ని అవకాశం రాజేంద్రప్రసాద్ తలుపుతట్టింది. డబ్బింగ్‌ థియేటర్లో ఏదో సినిమాకు డబ్బింగ్‌ చెప్తున్న సమయంలో మిద్దె రామారావుకి సంబంధించిన వ్యక్తులు వచ్చి హుటాహుటిన కార్లోకి తోసి.. ఆ అవకాశాన్ని అందించారు. ఆ సినిమాలో హీరోయిన్‌ శ్రీదేవి కాళ్లపై పడే సన్నివేశంలో ఓ ఆర్టిస్ట్‌ నటించేందుకు విముఖత చూపించడంతో.. ఆ పాత్రకు రాజేంద్రప్రసాద్‌ని ఎన్నుకున్నారు. సూపర్‌స్టార్‌ కృష్ణతోపాటు చిత్రంలోని ప్రధాన తారాగణమంతా పెళ్లి సన్నివేశంలోని ఉండగా.. పెళ్లి కొడుకు పాత్రలో రాజేంద్రప్రసాద్‌ తొలిసారి తళుక్కుమన్నారు.  హీరోయిన్‌ శ్రీదేవి పక్కన పెళ్లిపీటపై కూర్చున్న రాజేంద్రప్రసాద్‌ చెవిలో.. ‘తాళికడితే మటాషే.. తాట‌తీసేస్తా’నంటూ బెదిరించే సన్నివేశం అది. కృష్ణ ఆ డైలాగ్‌ చెప్తుంటే.. పెళ్లి కొడుకు పాత్రలో రాజేంద్రప్రసాద్‌ ఇస్తున్న ఎక్స్‌ప్రెషన్స్‌ అన్నీ ఇన్నీ కావు. ఆ ఎక్స్‌ప్రెషన్స్‌కి ముచ్చటపడిన కృష్ణ.. ఆ కొత్త కుర్రాడు బాగా చేస్తున్నాడంటూ సినీలోకంలో ప్రచారం ప్రారంభించేసరికి.. ఆ ఒక్క చిన్ని సన్నివేశం.. రాజేంద్రప్రసాద్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌గా ఎదిగేందుకు మరో పది అవకాశాల్ని వెంట తీసుకొచ్చింది.

దాంతో.. ఓ పక్క తెరవెనుక డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా, మరోపక్క తెరముందు సపోర్టింగ్‌ యాక్టర్‌గా రెండు చేతులా.. మూడు షిఫ్టులు పనిచేసే అవకాశాల్ని అందిపుచ్చుకున్నారాయన. ఆ తర్వాత త‌ర్వాత హీరోగా ఆయన ఎదిగిన తీరు ఔత్సాహికుల‌కు మరింత స్ఫూర్తిదాయకం.

హాట్సాప్‌ టు వంశీ

‘గుడి గంటలు మోగాయి’ సినిమా హీరో రాంజీకి డబ్బింగ్‌ చెప్తున్నప్పుడు రాజేంద్రప్రసాద్‌కి దర్శకుడు వంశీతో సాన్నిహిత్యం పెరిగింది. అప్పటికే తెరపై సపోర్టింగ్‌ కేరెక్టర్లు వేస్తున్న రాజేంద్రప్రసాద్‌లోని హీరోని గుర్తించారు వంశీ. దాంతో, రామోజీరావు ‘ప్రేమించు పెళ్లాడు’ సినిమా అవకాశం వచ్చింది. అయితే, ఆ సినిమా అనుకున్నంతగా ఆడకపోవడంతో.. మళ్లీ నాలుగురోడ్ల కూడలిలో నిల్చోవాల్సివచ్చింది. ఆ సినిమా ఫలితంపై దర్శకుడు వంశీ వ్యాఖ్యానిస్తూ.. ‘మనమైతే మంచి సినిమా చేశాం. ఫస్టాఫ్‌ అంతా నవ్వించాం. సెకండాఫ్‌ కాస్త దెబ్బ కొట్టి ఫలితం తారుమారైంది. అంతమాత్రాన నిరాశపడడమెందుకు?’ అంటూ రాజేంద్రప్రసాద్‌కి ధైర్యం చెప్పేవారు. ఆ తర్వాత ‘లేడీస్‌ టైల‌ర్‌’ ప్రాజెక్ట్‌ పురుడు పోసుకుంది.
‘లేడీస్‌ టైల‌ర్‌’ సినిమా తెలుగులో కామెడీ సినిమాకు ఓ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిన వైనం మ‌న‌కు తెలుసు. ఆ సినిమా తర్వాత మరెన్నో కామెడీ సినిమాలు నిర్మితమై హాస్యం పండించే సిస‌లైన‌ హీరోల‌కు సినీరంగంలో కావాల్సినంత స్థానం కల్పించాయంటారాయన.
తొలుత డబ్బింగ్‌ కళాకారుడిగా, తర్వాత్తర్వాత సపోర్టింగ్‌ యాక్టర్‌గా.. ఆ తర్వాత హాస్యం అనే మ‌త్తు చ‌ల్లే రియ‌లిస్టిక్‌ హీరోగా తన సినీ ప్రస్థానం ఆద్యంతం అనేకానేక మలుపుల‌తో, ఊపిరిసాగని ఉత్కంఠతో, ఒళ్లు గగుర్పొడిచే సస్పెన్స్‌తో, అనేకానేక ఆశ్చర్యాలు, ఆనంద విషాదాల్తో సాగిందంటూ ఆనాటి ముచ్చట్లను నెమరువేసుకుంటారాయన.
‘‘నాకన్నా నాకొచ్చిన అవకాశాలు మిన్న. అవి నన్ను ఆర్టిస్ట్‌గా నిబెట్టాయి’’ అంటారు రాజేంద్రప్రసాద్‌.          

గాడ్‌ఫాదర్‌ లేరు.. గాడ్‌ మాత్రమే ఉన్నారు:
‘‘ఇండస్ట్రీలో తనకెవరూ గాడ్‌ఫాదర్‌ లేరు. తాను నమ్ముకున్న గాడ్‌ మాత్రమే ఉన్నారు’’ అంటారు రాజేంద్రప్రసాద్‌. నమ్ముకున్న దైవం అడుగడుగునా తనని ఆదుకుందని ఆయన చెప్తుంటారు.

ఎన్టీఆర్‌తో అనుబంధం:
విశ్వవిఖ్యాత, పద్మశ్రీ నందమూరి తారకరామారావు... ఈ పేరు రాజేంద్రప్రసాద్‌ తరచూ వల్లెవేసే తారకమంత్రం. సాంఘిక, జానపద, పౌరాణిక చిత్రాల‌ ద్వారా ఎన్టీఆర్‌ సృష్టించిన ఖ్యాతి జగద్విఖ్యాతి. నందమూరి సొంతూరు నిమ్మకూరులోనే పుట్టి పెరిగిన రాజేంద్రప్రసాద్‌కి నందమూరి కుటుంబంతో గాఢానుబంధం ఉంది. సుమారు 24 సంవత్సరా...పాటు ఆయన వెనుక నడిచిన తీపిగుర్తులున్నాయి. ప‌లు సందర్భాల్లో ఆయన ఇచ్చిన సల‌హాలు, సూచనలు సినీ జీవితాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి ప్రధాన భూమిక నిర్వహించాయని కృతజ్ఞత నిండిన కళ్లతో చెప్తుంటారు రాజేంద్రప్రసాద్‌.


‘మూమెంట్‌ అండ్‌ మైమ్‌’లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రాజేంద్రప్రసాద్‌ ఇన్‌స్టిట్యూట్‌లో తన తర్వాత శిక్షణ పొందే విద్యార్థుల‌కు పాఠాలు చెప్పేవారు. ‘మూమెంట్‌ అండ్‌ మైమ్‌’ అంటే ఏమీ లేకుండా ఉన్నట్లు చేసి చూపించడం. అందులో శిక్షణ పొందడం కాల‌క్ర‌మంలో రాజేంద్రుని నటజీవితానికి ఎంతో పనికొచ్చిందంటే ఏమాత్రం అతిశ‌యోక్తి కాదు .
అబ్జర్వేషన్‌.. ఇంప్రవైజేషన్‌’ అనే సబ్జెక్ట్‌ల్లో ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ ఉపయోగపడిందంటారు రాజేంద్రప్రసాద్‌. అంతేకాదు.. ‘ఎవ్విరీ థింగ్‌ ఇన్‌ యువర్‌ లైఫ్‌ స్టార్ట్స్‌ విత్‌ ఇమిటేషన్‌.. ఎండ్స్‌ విత్‌ క్రియేషన్‌’. ఈ విషయాన్ని ఆకళింపు చేసుకోవడం వ‌ల్ల‌నే రాజేంద్రప్రసాద్‌ పరిపూర్ణనటుడిగా ఎదిగారు. ఇంకా ఇంకా ఎదుగుతూనే ఉన్నారు. ఇప్ప‌టికీ తెలుగు ప్రేక్ష‌కుల్ని త‌న‌దైన ముద్ర‌తో ఆక‌ట్టుకుంటూనే ఉన్నారు. క్విక్ గన్ మురుగన్ చిత్రంతో హాలీవుడ్లో ప్రవేశించారు రాజేంద్రుడు. కామిక్ తరహా క్యారెక్టర్లతో తెరకెక్కించిన ఈ చిత్రం ద్వారా నటుడిగా మరో ఎత్తుకి ఎదిగారన్న పేరొచ్చింది. సౌతిండియన్ ఫేమస్ ఫేస్ కాబట్టి తనని ఈ అవకాశం వరించిందని చెబుతారాయన.

ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. రాజేంద్రుని కీర్తిని నలుదిశలా వ్యాపింపజేయడంలో ఆయన త‌న దర్శకుల పాత్రను ఎన్న‌టికీ విస్మరించరు. విఖ్యాత దర్శకుడు బాపు తెరకెక్కించిన స్నేహం చిత్రంతో కెరీర్ ప్రారంభించిన రాజేంద్రుడు అటుపై జంధ్యాల, ఇ.వి.వి.సత్యనారాయణ, వంశీ, రేలంగి నరసింహారావు, ఎస్.వి.కృష్ణారెడ్డి వంటి దర్శకులతో పనిచేసి గొప్పఖ్యాతిని ఆర్జించారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లోనూ చంద్ర సిద్ధార్థ్‌, త్రివిక్రమ్, సుకుమార్ వంటి దర్శకుల ప్రోత్సాహంతో ఎన్నో అవకాశాలు అందుకుంటున్నారు. జులాయి, నాన్నకు ప్రేమతో సినిమాల్లో రాజేంద్రుని నటనను తెలుగు ప్రేక్షకులు అంత తేలిగ్గా మర్చిపోలేరు.

ఒకప్పుడు హ‌స్యం అనే విరిజ‌ల్లుల‌తో నేచుర‌ల్‌ హీరోగా రాణించినా.. ప్రస్తుతం వయసు దృష్ట్యా తండ్రి పాత్రల్లో నటింకేందుకు ఏమాత్రం భేషజం లేదని ఒప్పుకుంటారాయన. నవతరం హీరోలకు తండ్రిగా నటిస్తూ ప్రేక్షకుల మెప్పు అందుకుంటున్నారు. అసలు హాస్యం పండించే టిఫిక‌ల్‌ హీరో  చేయలేనిదేముంటుంది. హృదయాల్ని హత్తుకునే, గుండె కరిగించే కరుణ రసాన్ని పోషించడంలోనూ వారిదే పైచేయి అని చెబుతారాయన. చార్లీచాప్లిన్ అందుకు చక్కని ఉదాహరణ. తమిళనటుడు నగేష్ ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో రాణించారని చెబుతారు. తాను సైతం ఆ తరహాలోనే విలక్షణతను ఆపాదించుకుని తెలుగువారిని మెప్పించే ప్రయత్నం చేశానని, అందరి ఆశీస్సులు తనకి దక్కాయని చెబుతారు. అందుకు గర్విస్తున్నానని ఎంతో వినమ్రంగా చెబుతారు.

ప్రస్తుతం మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) అధ్యక్షునిగానూ కొత్తబాధ్యతలు నెత్తికెత్తుకున్నారు. మా అసోసియేషన్ తరపున కళాకారుల సంక్షేమానికి పెద్ద పీట వేసి పనిచేస్తానని వాగ్ధానం చేశారు. మాట ఇచ్చిన ప్రకారం పలువురు కళాకారులకు తనవంతు సాయం అందిస్తున్నారు. పేద కళాకారుల్ని ఆదుకుంటున్నారు. అంతేనా సీనియర్ కళాకారుల్ని స్మరించుకోవడం మన ధర్మం.. అంటూ నాటి మేటి కళాకారులందరినీ జనరల్ బాడీ మీటింగుల్లో సన్మానించుకునే కొత్త సాంప్రదాయానికి తెరతీసి అందరి మన్ననలు అందుకున్నారు. మనసున్న మారాజు మా అధ్యక్షుడు రాజేంద్రుడు అంటూ అందరూ ఆయన్ని కీర్తించి, ఆప్యాయంగా అభినందిస్తున్నారు. అత‌డికి అంద‌రి త‌ర‌పున పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌ల‌తో పాటు అభినంద‌న‌లు చెబుతున్నాం.


                                                                                                                                     --రవి కిరణ్ మాదినీడి
మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us

Facebook          Twitter          YouTube          Blog          Google+

No comments:

Post a Comment