Latest News

Saturday, February 27, 2016

‘క్షణం’ సినిమా రివ్యు || Tolly Beats


‘క్షణం’ సినిమా రివ్యు || Tolly Beats


Tolly Beats Rating: 4.25/5

తెలుగు, తమిళ భాషల్లో ఓ పక్క వరుసగా భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ వెళుతోన్న పీవీపీ సినిమా, మరోపక్క పూర్తిగా కొత్తదనమున్న చిన్న సినిమాలను కూడా నిర్మించే ఆలోచనతో క్షణంఅనే ప్రయోగాత్మక సినిమాను నేడు ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. అడవి శేష్, అదాశర్మ, అనసూయ, సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా గత కొద్దికాలంగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. మరి ఆ క్రేజ్‌ను నిలబెట్టేలా సినిమా ఉందా? చూద్దాం..

కథ :

రిషి (అడివి శేష్) అమెరికాలో సెటిలైన ఓ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్. అక్కడే జీవనం సాగిస్తూండే రిషి, అతడి మాజీ గర్ల్‌ఫ్రెండ్ అయిన శ్వేత (అదా శర్మ) నుంచి వచ్చిన కాల్‌తో ఆమెను కలిసేందుకు ఇండియా వస్తాడు. రిషి ఇండియా వచ్చేశాక శ్వేత, తన కూతురిని ఎవరో కిడ్నాప్ చేశారన్న షాకింగ్ విషయాన్ని అతడికి చెప్తుంది.

ఆ పాపను వెతకడం కోసం రిషి, పోలీసులను ఆశ్రయిస్తే వారినుంచి కూడా సరైన స్పందన దొరకదు. ఇలాంటి పరిస్థితుల్లో రిషి, తానే స్వయంగా పాపను వెతికే ప్రయాణం మొదలుపెడతాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన ఇబ్బందులు ఏంటి? ఈ కిడ్నాప్ కథేంటి? అన్న ప్రశ్నలకు ఆసక్తికర సమాధానమే మిగతా కథ.
ప్లస్ పాయింట్స్ :

క్షణంసినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే ఇలాంటి కొత్తదనమున్న థ్రిల్లింగ్ సినిమాను తెలుగు సినీ ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేయడం గురించి చెప్పుకోవాలి. మొదట్నుంచి చివరివరకూ ఎక్కడా సినిమా ఫ్లో మిస్ అవ్వకుండా పకడ్బందీగా అల్లిన సన్నివేశాలు బాగా మెప్పిస్తాయి. ఒక థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన వేగాన్ని ఎక్కడా తగ్గించకుండా, ఎమోషనల్‌గా ఇలాంటి కథను చెప్పడంలో తీసుకున్న జాగ్రత్తలు అబ్బురపరుస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకే హైలైట్‌గా చెప్పుకోవచ్చు. ఒక బలమైన సెకండాఫ్‌కు లీడ్‌గా ఈ ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా బాగుంది.

ఇక నటీనటులంతా ఈ సినిమాను మరో ఎత్తుకి తీసుకెళ్ళేలా చేశారనే చెప్పుకోవచ్చు. అందరికంటే ముఖ్యంగా అడివి శేష్, సినిమాను దాదాపుగా తన భుజాలపై మోశాడనే చెప్పుకోవాలి. ఫస్ట్ ఫ్రేం దగ్గర్నుంచి చివరి ఫ్రేం వరకూ అడివి శేష్ అద్భుతమైన నటన ఈ సినిమాకు మేజర్ హైలైట్స్‌లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఒక టఫ్ క్యారెక్టర్‌లో అదా శర్మ మంచి ప్రతిభ చూపింది. ఎమోషనల్ సన్నివేశాల్లో అదా చాలా బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాతో పూర్తి స్థాయి పాత్రలో నటించి, వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన అనసూయ ఒక పోలీస్ పాత్రలో చాలా బాగా నటించింది. అనసూయకు ఈ సినిమా కచ్చితంగా సూపర్ డెబ్యూట్ అనే చెప్పాలి. ఇక జ్యోతిలక్ష్మిసినిమాతో హీరోగా మెప్పించిన సత్యదేవ్, మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు. సత్యదేవ్ నటన ఈ సినిమాకు మంచి ప్లస్ పాయింట్.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో అక్కడక్కడా కొన్ని విషయాలను పూర్తిగా చెప్పకుండా మధ్యలో వదిలేసినట్లనిపించింది. అదేవిధంగా అనసూయ పాత్ర కొన్ని పరిస్థితులను ఎదుర్కొనే క్రమంలో వచ్చే సన్నివేశాలు సహజత్వానికి కొంచెం దూరం ఉన్నట్లు అనిపించింది. ఇక సెకండాఫ్‌లో సినిమా వేగం కాస్త మందగించినట్లు కనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో వచ్చే ఓ పాట కూడా సినిమా ఫ్లోను కాస్త దెబ్బతీసిందనే చెప్పాలి. ఇక ఈ తరహా కథాంశం, కథనం ఉన్న సినిమాలు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను మాత్రమే చూసేవారికి పెద్దగా నచ్చకపోవచ్చు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే, ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో క్షణం టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఉన్న సినిమాగా నిలుస్తుందని కచ్చితంగా చెప్పుకోవచ్చు. లిమిటెడ్ బడ్జెట్‌లోనే పీవీపీ సినిమా ఈ స్థాయి ఔట్‌పుట్‌ను తీసుకురావడాన్ని మెచ్చుకోవాల్సిందే. ప్రొడక్షన్ వ్యాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్ షానియల్ డియో పనితనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! సినిమా మూడ్‌ను క్యారీ చేస్తూనే సినిమాటోగ్రాఫర్ చేసిన ప్రయోగాలు అబ్బురపరుస్తాయి. శ్రీ చరణ్ పాకాల అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. చెప్పాలంటే తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో చరణ్ సినిమా స్థాయిని పెంచాడు. అడివి శేష్‌తో కలిసి దర్శకుడు రవికాంత్ పేరేపు రాసుకున్న స్క్రీన్‌ప్లే బాగుంది.

ఇక దర్శకుడు రవికాంత్ గురించి చెప్పుకుంటే, మొదటి సినిమా అంటే ఓ దర్శకుడిలో కనిపించే కసిని ఈ సినిమాలో చూడొచ్చు. ఇలాంటి ఒక సినిమాను తీయాలన్న ఆలోచనతో పాటు, అందుకు సరైన స్క్రీన్‌ప్లేను రాసుకోవడం, సన్నివేశాలను కూర్చడం, సస్పెన్స్‌ను చివరివరకూ కొనసాగించడం వంటి విషయాల్లో రవికాంత్ ప్రతిభ మెచ్చుకోతగినది. దర్శకుడిగా రవికాంత్ మేకింగ్ పరంగా చాలాచోట్ల ప్రయోగాలు చేశాడు.

తీర్పు :

తెలుగులో డిఫరెంట్ సినిమా అనే కాన్సెప్ట్‌కు కొద్దికాలంగా మంచి ఆదరణ కనిపిస్తూ వస్తోంది. కొత్తదనమున్న సినిమా ఏది వచ్చినా దాన్ని ఆదరిస్తామన్న విషయాన్ని ప్రేక్షకులూ స్పష్టం చేస్తూ డిఫరెంట్ సినిమాకు పట్టం కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే, ఈ తరహా సినిమాలను కోరే వారిని దృష్టిలో పెట్టుకొని వచ్చి, అందరినీ మెప్పించిన సినిమాయే క్షణం’. డిఫరెంట్ కథాంశం, మొదట్నుంచీ చివరివరకూ ఎక్కడా పడిపోని వేగం, ఆసక్తికరమైన సస్పెన్స్ ఎలిమెంట్స్.. ఇవన్నీ కలిపి క్షణంసినిమాకు ఒక అర్థాన్ని తెచ్చిపెట్టాయి. ఇకపోతే రెగ్యులర్ కమర్షియల్ అంశాలను కోరుకునే వారికి మాత్రం ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే.. కొత్తదనమున్న సినిమాను బాగా కోరేవారు, సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని కోరుకునే వారికి ఈ సినిమా విపరీతంగా నచ్చుతుంది.


రివ్యూ బై విజ్ఞాన్ దాసరి

No comments:

Post a Comment