Latest News

Saturday, March 26, 2016

‘రన్’ సినిమా రివ్యు


‘రన్’ సినిమా రివ్యు

  Tolly Beats Rating: 3.75/5

తెలుగులో ఎప్పటికప్పుడు విలక్షణ సినిమాలు చేసుకుంటూ మెప్పిస్తోన్న హీరో సందీప్ కిషన్, తాజాగా తమిళ, మళయాలంలో బంపర్ హిట్ కొట్టిన ‘నేరమ్’ అనే సినిమాను తెలుగులో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ‘రన్’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా మంచి అంచనాలతో హోళీ కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టైమ్ ప్రధానంగా నడిచే ప్రయోగాత్మక సినిమాగా ప్రచారం పొందిన ఈ సినిమా ఎంతమేరకు ఆకట్టుకుందీ? చూద్దాం..

కథ :

సంజయ్ (సందీప్ కిషన్) అనే యువకుడి జీవితంలో టైమ్ చుట్టూ ఒక్కరోజు జరిగే సంఘటనల సమాహారమే ‘రన్’ సినిమా. సంజయ్, తన అక్క పెళ్ళి కోసం వడ్డీ రాజా (బాబీ సింహా) అనే కిరాతక వడ్డీ వ్యాపారి వద్ద అప్పు తీసుకుంటాడు. ఆ అప్పు తీర్చే సమయానికి అతడి జాబ్ పోతుంది. ఈ పరిస్థితుల్లో ఫ్రెండ్ ద్వారా తీసుకున్న డబ్బుతో ఆ అప్పు తీర్చాలనుకుంటాడు. అయితే అనుకోని సంఘటనలో ఆ డబ్బు దొంగతనానికి గురవుతుంది.
ఈ క్రమంలో అప్పెలా తీర్చాలీ అనుకుంటున్న సమయంలోనే సంజు ప్రేమించిన అమ్మాయి అమూల్య (అనీషా), అతడి కోసం ఇంట్లోనుంచి పారిపోయి వస్తుంది. ఒకేరోజు ఇన్ని సమస్యలు ఉన్న వ్యక్తి సాయంత్రానికల్లా ఆ సమస్యలను ఎలా పరిష్కరించుకున్నాడూ? ఈ ఒక్కరోజు ప్రయాణంలో ఏమేం జరిగాయి? అన్న ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా.

ప్లస్ పాయింట్స్ :

‘టైమ్’ అనే అంశం చుట్టూ ఒక కథ అల్లి, దానిచుట్టూ తిరిగే కొన్ని సమస్యలు, వ్యక్తులతో ఒక్కరోజులో కథ చెప్పాలన్న ఆలోచనను ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. ఇక ఆ ఆలోచనను పూర్తిస్థాయి కథగా మలిచిన విధానం కూడా బాగుంది. ప్రధాన కథకు ఒక్కో క్యారెక్టర్‌ను కలుపుతూ చేసిన స్క్రీన్‌ప్లే ప్రయోగం బాగా ఆకట్టుకుంటుంది. ఇక సినిమా పరంగా ఫస్టాఫ్‌ను ఈ సినిమాకు హైలైట్‌గా చెప్పుకోవచ్చు. కథలోని అసలు పాయింట్‌ని ఈ భాగంలోనే తెలివిగా పరిచయం చేశారు. రెండు గంటల లోపే నిడివి ఉన్న ఈ సినిమా అనవసర ఆర్భాటాలకు పోకుండా నడవడం బాగుంది.

ఇక హీరో సందీప్ కిషన్ ఎప్పట్లానే నటుడిగా మంచి ప్రతిభే కనబరిచాడు. తన గత సినిమాలోల్లా పూర్తిగా హీరో చుట్టూనే తిరిగే కథ కాకపోవడంతో సందీప్, తన పాత్ర పరిధి దాటే ప్రయత్నం చేయలేదు. ఎమోషనల్ సన్నివేశాల్లో బాగా నటించాడు. అనీషా పాత్ర కథలో కీలకమైనదే అయినా తక్కువ నిడివి ఉన్నది. ఉన్నంతలో ఆమె ఫర్వాలేదనిపించింది. ఇక వడ్డీ రాజాగా బాబీ సింహా బాగా చేశాడు. పోలీసాఫీసర్‌గా బ్రహ్మాజీ, పొలిటికల్ లీడర్‌గా పోసాని అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు సెకండాఫ్‌ను మైనస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. సెకండాఫ్‌లో సినిమాను కొన్నిచోట్ల మందకొడిగా నడిపించారు. ఈ టైమ్‍లో వచ్చే సన్నివేశాలు కొన్ని బోరింగ్‌గా ఉన్నాయి. బాబీ సింహా, అనీషాల పాత్రలకు సరైన క్యారెక్టరైజేషన్ లేదు. వడ్డీ రాజా అనే పాత్ర సినిమాను ఇన్ని మలుపులు తిప్పేంత బలంగా చిత్రించలేదు. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లకు వచ్చేసరికి తొందర తొందరగా చుట్టేసి, చివర్లో సినిమాను తేలిపోయేలా చేశారు.
హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేదు. ఈ లవ్‌స్టోరీలో ఫ్రెష్‌నెస్ లేదు. ఇక సెకండాఫ్‌లో హీరోయిన్ పాత్రను చాలాచోట్ల ప్రస్తావనకు కూడా తీసుకురాకపోవడం ఆకట్టుకోలేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే, మళయాల మాతృకకు కథ, స్క్రీన్‌ప్లే అందించిన ఆల్ఫన్స్ పుత్రన్ స్టైల్ నెరేషన్ గురించి చెప్పాలి. మళయాల ఒరిజినల్ కథకు ఏమాత్రం మార్పులు చేయకుండా తెలుగులో దర్శకుడు అనీ అలాగే చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే తెలుగు సినిమాకు ఈ కథకు కావాల్సిన మూడ్‌ను సెట్ చేయలేకపోయారు. చివర్లో సినిమాను చకచకా తేల్చేయడం విషయంలో జాగ్రత్త పడాల్సింది. దర్శకుడిగా టైటిల్ కార్డ్స్ పడడం, ఫస్టాఫ్‌లో కొన్ని స్టైలిష్ షాట్ కంపోజిషన్స్‌లో అనీ ప్రతిభను మెచ్చుకోవచ్చు. ఓవరాల్‌గా దర్శకుడిగా ఫర్వాలేదనిపించాడు.
రాజశేఖర్ సినిమాటోగ్రఫీని సాంకేతిక అంశాల పరంగా మరో ప్రధాన ప్లస్‌గా చెప్పుకోవాలి. తక్కువ బడ్జెట్‌లో, తక్కువ లొకేషన్స్‌లో నడిచే సినిమాను అన్నివిధాలా ఉన్నంతలో క్వాలిటీగా ఉంచేలా చేయడంలో సినిమాటోగ్రాఫర్ పనితనం బాగుంది. సంగీత దర్శకుడు సాయి కార్తీక్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఫర్వాలేదు. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు సరిగ్గా సరిపోయింది. ఎడిటింగ్ బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

తీర్పు :
ఒక భాషలో హిట్ అయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేయాలంటే, రీమేక్ చేస్తోన్న భాషకు కనెక్ట్ అయ్యే బలమైన ఎమోషనో లేదా కొత్తదనమో ఉండాలి. ‘రన్’ సినిమా ప్రధానంగా టైమ్ అనే అంశం చుట్టూ ఒక్కరోజులో జరిగే విలక్షణ కథ కావడంతో తెలుగు ప్రేక్షకులకూ ఈ అంశం కొత్తగా కనిపిస్తూ మెప్పించేదిగా చెప్పుకోవచ్చు. కథాంశం కొత్తగా ఉండడం, ఫస్టాఫ్‌లో ఈ కథాంశాన్ని తెలివిగా పరిచయం చేయడం, పాత్ర పరిధిలోనే ఉంటూ మెప్పించిన నటీనటవర్గం.. ఇలాంటి ప్లస్‌లతో వచ్చిన ఈ సినిమాలో సెకండాఫ్‌ కొంత బోరింగ్‌గా ఉండడం, చివర్లో అంతా ఒక్కసారే తొందర తొందరగా తేల్చేయడం లాంటివి మైనస్‌లుగా చెప్పుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే.. రెండు గంటల లోపే నిడివి ఉన్న ఈ సినిమా కథలో, కథ చెప్పే విధానంలో కొత్తదనం కోరుకునే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలనే ఇష్టపడేవారికి కూడా ఈ సినిమా ఫర్వాలేదనిపిస్తుంది.

---రివ్యూ బై విజ్ఞాన్ దాసరి

మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us

Facebook: https://www.facebook.com/Tollybeatsmedia/

Twitter: https://twitter.com/BeatsTolly

YouTube: https://www.youtube.com/channel/UCmc5YqKIfIWK5pdLCqLJv6w

Blog: http://tollybeatsmedia.blogspot.in

Google+: https://plus.google.com/u/0/112797037583980613598

No comments:

Post a Comment