Latest News

Sunday, April 17, 2016

పోలీస్‌ సినిమా రివ్యు || POLICE Movie Review


పోలీస్‌ సినిమా రివ్యు


TOLLY BEATS RATING: 3.25/5

తమిళంలో భారీ స్థాయి అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ సినిమా నేడు తెలుగులో పోలీస్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తెలుగు విడుదల చేయడంతో ఈ సినిమాకు కొద్దికాలంగా మంచి క్రేజ్ వచ్చింది. మరి ఈ పోలీస్ డ్రామా ఎంతమేరకు ఆకట్టుకుందీ? చూద్దాం...

కథ :

జోసెఫ్ కురివిల్లా (విజయ్) కేరళలోని ఒక చిన్న ప్రాంతంలో తన కూతురు నివేదిత (బేబీ నైనిక)తో కలిసి సాధారణం జీవనం గడుపుతూ ఉంటాడు. ఏ ఇబ్బందులూ లేకుండా సాఫీగా సాగిపోతుందనుకున్న అతడి జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు వచ్చిపడతాయి. ఆ పరిస్థితుల వల్లే నివేదిత స్కూల్ టీచర్ అయిన అనీ (అమీ జాక్సన్)కి జోసెఫ్, తన గత జీవితం గురించి తెలపాల్సి వస్తుంది.

హైద్రాబాద్‍లో నార్త్ జోన్‌కి డీసీపీగా పనిచేస్తూ, పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్, జోసెఫ్‌గా పేరు మార్చుకొని వేరేదో ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? అతడి గత జీవితం ఏంటి? గత జీవితంలో అతడికి ఎవరితో శతృత్వం ఉంది? ఆ శతృత్వం వల్ల అతడి భార్య మిత్ర (సమంత), తల్లి రాధికలు ఏమయ్యారు? లాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే మొదట్నుంచీ చివరివరకూ అద్భుతమైన ఎమోషన్స్ క్యారీ అవుతూ ఉండడమనే పాయింట్ గురించి చెప్పాలి. ఒక కూతురితో ప్రశాంత జీవితం గడిపే తండ్రి ప్రయాణం; తల్లి, భార్యలతో అందంగా సాగిపోయే అతడి గత జీవిత ప్రయాణం, వృత్తి రీత్యా చూసే కొన్ని తట్టుకోలేని సంఘటలు.. ఇలా ఈ ప్రయాణాల చుట్టూ ఉన్న ఎమోషన్ కట్టిపడేసేలా ఉంటుంది. సినిమా పరంగా ఈ ఎమోషన్సే హైలైట్ అవుతూ సినిమాను నిలబెడుతూ వస్తుంటాయి. ఇంటర్వెల్ బ్లాక్ సినిమాకే మేజర్ హైలైట్. హీరోయిజంతో పాటు అసలు కథలోని ఎమోషన్‌ని తారాస్థాయికి తీసుకెళ్ళే ఈ సన్నివేశం గురించి ఎంత చెప్పినా తక్కువే. క్లైమాక్స్‌లో వచ్చే కొన్ని డైలాగ్స్ ఈ సినిమా సలు పాయింట్‌ను కొత్త కోణంలో పరిచయం చేయడం బాగుంది.

హీరో విజయ్ సినిమాను పూర్తిగా తన భుజాలపై మోసుకొచ్చాడు. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో విజయ్ ఒదిగిపోయి నటించాడు. ఇక ఆయన ఫ్యాన్స్‌ని సంతృప్తి పరచేలా రూపొందించిన సన్నివేశాల్లో విజయ్ మాస్ పవర్ చూడొచ్చు. విజయ్ తర్వాత ప్రఖ్యాత తమిళ దర్శకుడు మహేంద్రన్ నటనను ఈ సినిమాకు మరో హైలైట్‌గా చెప్పుకోవచ్చు. ఎక్కువగా మాట్లాడకుండా చాలా కూల్‌గా ఉంటూనే ఎంతో వయలెంట్‌గా కనిపించేలా దర్శకుడు ఆ పాత్రను రూపొందించిన తీరు, దాన్ని మహేంద్రన్ పోషించిన విధానానికి వంకబెట్టలేం. సమంత ఎప్పట్లానే తనదైన యాక్టింగ్‌తో కట్టిపడేసింది. అమీ జాక్సన్‍ది చిన్న పాత్రే అయినా బాగా నటించింది. బేబీ నైనికా తన పాత్రకే ఓ అందాన్ని తెచ్చిపెట్టుకుంది. రాధికా, ప్రభు, రాజేంద్రన్.. తదితర నటీనటులంతా తమ పరిధిమేర బాగా నటించారు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మైనస్ పాయింట్ అంటే, సినిమాకు హైలైట్ అయిన ఎమోషన్స్ అన్నింటినీ కలిపేందుకు రాసిన కథ చాలా సార్లు చూసిందే కావడం. ఇలాంటిదే పోలీస్ కథకు ఫ్యామిలీ ఎలిమెంట్స్‌ను కలిపి గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఎంతవాడు గానీ..’ సినిమాకు, ‘పోలీస్’కు చాలా పోలికలున్నాయి. సూపర్ ఫస్టాఫ్ తర్వాత సినిమా అంతా ఒక పద్ధతిలో సాగకుండా ఏవేవో అంశాలను ఫోకస్ చేస్తూ కాస్త పక్కదారి పట్టినట్టు అనిపుస్తూంటుంది. పాటలు అంతంతమాత్రమే ఉండగా, అవి వచ్చే సందర్భాలు కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేవు.

అదేవిధంగా సినిమా వెళితే పూర్తిగా ఒకే ట్రాక్‌లోకి వెళ్ళిపోవడం చూస్తే, ఎపిసోడ్స్ చూస్తున్నట్టుగా ఉంటుంది. అయితే పూర్తిగా ఫ్యామిలీ, లేదంటే పూర్తిగా పోలీస్ లైఫ్.. ఇలా బ్లాక్‌లుగా కథ చెప్పడం అంత బాగోలేదు. ఒక పాయింట్ తర్వాత సినిమా రివెంజ్ డ్రామాను మాత్రమే చెప్తున్న ఫీలింగ్ తేవడం కూడా అసలు కథను పక్కదారి పట్టించింది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే, ముందుగా దర్శకుడు అట్లీ గురించి చెప్పుకోవాలి. ఒక సూపర్ స్టార్ సినిమా నుంచి ఏయే అంశాలైతే ప్రేక్షకులు కోరుకుంటారో ఆయా అంశాలన్నీ చెప్తూనే, ఎమోషన్‌ను ఎక్కడా పడిపోకుండా దర్శకుడు జాగ్రత్తపడ్డాడు. ఆయా ఎమోషన్స్‌ను పండించిన విధానం, ఇంటర్వెల్, క్లైమాక్స్‌లలో దర్శకుడి ప్రతిభ చాలా బాగుంది. కథ పరంగా ఎప్పటికీ బలమైనదే అయిన రొటీన్ కథను ఎంచుకున్నా, దాన్ని పూర్తిస్థాయి సినిమాగా మలచడంలో రచయితగా కొన్నిచోట్ల తడపడ్డాడు.

సాంకేతిక అంశాల పరంగా సినిమాటోగ్రాఫర్ జార్జి సి. విలియమ్స్ ప్రతిభను మరో హైలైట్‌గా చెప్పుకోవచ్చు. భిన్నమైన ఎమోషన్స్‌ను, నేపథ్యాన్ని, కథ రీత్యా వచ్చే మార్పులను సినిమాటోగ్రఫీ పరంగానూ ఎలివేట్ చేయడం బాగుంది. జీ.వీ.ప్రకాష్ పాటలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయేలా ఉంది. మాస్ సన్నివేశాలను జీవీ మ్యూజిక్ మరింత ఎత్తుకి తీసుకెళ్ళాయి. ఎడిటింగ్ పద్ధతిగా బాగుంది. కళైపుళి థాను ప్రొడక్షన్ వ్యాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు వర్షన్ కోసం దిల్‌రాజు తీసుకున్న జాగ్రత్తలు చాలా బాగున్నాయి. ఎక్కడా తమిళ సినిమా అనే ఫీల్ రాకుండా చేయగలిగారు.

తీర్పు :

పోలీస్ కథంటే.. ఆ నేపథ్యాన్ని మాత్రమే చూపిస్తూ, ఒక్క కోణాన్నే చెప్పే కథలు ఒక రకం. అదే పోలీస్ కథకు వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ నేపథ్యాన్ని జతచేసి ఓ ఎమోషనల్ జర్నీని కూడా చెప్పడం మరో రకం. ‘పోలీస్’ అంటూ వచ్చిన విజయ్ కొత్త సినిమా.. రెండో రకం పోలీస్ డ్రామా. సినిమా ఆసాంతం కట్టిపడేసేలా సాగిపోయే ఎమోషన్స్, కొన్ని మాస్ ఎలిమెంట్స్, కొత్తగా కనిపించే ఇంటర్వెల్, క్లైమాక్స్, విజయ్ వన్ మ్యాన్ షో, సమంత యాక్టింగ్ లాంటి హైలైట్స్‌తో వచ్చిన ఈ సినిమాలో కథ ఇప్పటికే చాలాసార్లు చూసింది కావడం, సెకండాఫ్‌లో ఫస్టాఫ్ స్థాయిలో లేకపోవడం, అసందర్భంగా వచ్చే ఆకట్టుకోని పాటలు లాంటివి ప్రతికూలాంశాలు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఎక్కడా ఒక తమిళ సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కల్పించని ఈ సినిమాను ఇదివరకు చూసిన కథైనా ఎప్పటికీ కొత్తగా కనిపించే ఎమోషన్స్ కోసం ఓసారి చూడొచ్చు.



---రివ్యూ బై విజ్ఞాన్ దాసరి

మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us






No comments:

Post a Comment