Latest News

Friday, April 22, 2016

సరైనోడు సినిమా రివ్యు || Sarainod Movie Review



సరైనోడు సినిమా రివ్యు || Sarainod Movie Review

TOLLY BEATS RATING: 3.25/5

మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. బన్నీని పూర్తి స్థాయి మాస్ హీరోగా పరిచయం చేసే సినిమాగా ప్రచారం పొందిన ‘సరైనోడు’, ఆ టార్గెట్‌ను ఎంతవరకు రీచ్ అయ్యాడూ? తారాస్థాయిలో ఉన్న అంచనాలను అందుకోగలిగాడా? చూద్దాం...

కథ :
బార్డర్‍లో కంటే సమాజంలోనే ఎక్కువ సమస్యలున్నాయని చెప్పి, గన (అల్లు అర్జున్) తన మిలిటరీ ఉద్యోగాన్ని వదిలేసి హైద్రాబాద్‌లో కుటుంబంతో కలిసి జీవిస్తుంటాడు. బాబాయ్ (శ్రీకాంత్)తో కలిసి వ్యవస్థకు అందని నేరగాళ్లకు తన స్టైల్లో బుద్ధి చెప్పడమే గన పని. ఇదిలా సాగుతుండగానే, గన, తానుండే ఏరియాకి ఎమ్మెల్యే అయిన హన్షితా రెడ్డి (క్యాథరిన్ థ్రెసా)తో ప్రేమలో పడతాడు. హన్షితాతో గన పెళ్ళి ఫిక్స్ అవుతున్న సమయంలో, అతణ్ణి వెతుక్కుంటూ, కాపాడమని మహాలక్ష్మి (రకుల్ ప్రీత్) వస్తుంది.

మహాలక్ష్మి ఏ ఆపదలో ఉండి గన కోసం వచ్చింది? మహాలక్ష్మికి, గనకి సంబంధం ఏంటి? తన బ్యాక్‌గ్రౌండ్‌ని టచ్ చేస్తే, తనకు కావాల్సింది దొరక్కపోతే ఎంతకైనా తెగించే వైరం ధనుష్‌ (ఆది)కి మహాలక్ష్మి గ్రామానికి ఉన్న సంబంధం ఏంటి? వ్యవస్థ మొత్తాన్నీ తన చెప్పు చేతల్లో పెట్టుకున్న ధనుష్‌ని గన ఎలా ఎదిరించాడు? లాంటి ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే అల్లు అర్జున్‌ను పూర్తి స్థాయి మాస్ హీరోగా పరిచయం చేసేందుకు ఏయే అంశాలైతే అవసరమో వాటిని దర్శకుడు బోయపాటి సరిగ్గా వాడిన విధానం గురించి చెప్పుకోవచ్చు. ఇక ఇలాంటి ఒక మాస్ పాత్రలో నటించగలనని ఋజువు చేసుకున్న బన్నీ కూడా ఈ సినిమాకు హైలైట్స్‌లో ఒకరుగా చెప్పుకోవచ్చు. యాక్టింగ్‌లో, డైలాగ్ డెలివరీలో, స్టైల్‌లో అన్నింటా బన్నీ కట్టిపడేశాడు. ముఖ్యంగా యాక్షన్స్ సీక్వెన్సెస్, పాటల్లో బన్నీ స్టామినా ఏంటో ఈ సినిమాతో మరోసారి స్పష్టం అవుతుంది. ఇక సినిమాను చాలాచోట్ల తన ఈజ్‌, స్క్రీన్‌ ప్రెజెన్స్‌తో భుజాలపై మోసుకొచ్చాడనే చెప్పాలి.

విలన్ ఆది పినిశెట్టిని సినిమాకు మరో హైలైట్‌గా చెప్పుకోవచ్చు. హీరోగా బాగానే మెప్పిస్తోన్న ఆది, ఈ సినిమాలో విలన్‌గా చేసి సినిమాకు మంచి స్థాయి తీసుకొచ్చాడు. ముఖ్యంగా తక్కువ మాట్లాడుతూ, స్టైలిష్‌గా కనిపిస్తూనే ఈ స్థాయి విలనిజం చూపడంలో ఆది ప్రతిభ బాగుంది. పాటల చిత్రీకరణ ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. హీరోయిన్లు ఇద్దరూ తమ తమ అందచందాలతో బాగా ఆకట్టుకుంటారు. రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పట్లానే తాను మంచి నటినేనని మరోసారి నిరూపించుకుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్‍లో రకుల్ నటన చాలా బాగుంది. ఇక క్యూట్‌గా కనిపిస్తూనే, తన పాత్రకు నటన పరంగా క్యాథరిన్ థ్రెసా మంచి న్యాయం చేసింది. శ్రీకాంత్ తన పాత్రలో ఒదిగిపోయాడు. మిగతా వారంతా తమ పరిధిమేర బాగా నటించారు.

సినిమా పరంగా చూస్తే.. హీరో, విలన్‌ల ఇంట్రడక్షన్; వారిద్దరికీ ‘బ్యాక్‌గ్రౌండ్ చూస్తావా?’ అన్న కామన్ పాయింట్‌తో ఉన్న కనెక్షన్, ఇంటర్వెల్ బ్లాక్, సెకండాఫ్‌లో పర్ణశాల గ్రామంలో ఉండే ఓ కొత్తదనమున్న ఫైట్, బ్రహ్మానందం కామెడీ, వినడానికి, చూడ్డానికి బాగున్న పాటలను ప్లస్‌పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు అసలైన మైనస్ పాయింట్ అంటే కథలో ఎక్కడా కొత్తదనం అన్నదే లేకపోవడం గురించి చెప్పుకోవాలి. హీరో, విలన్‌ల ఆలోచన విధానాల్లో ఉండే చిన్న కామన్ పాయింట్ మినహాయిస్తే పూర్తి కథ ఇప్పటికే చాలా సార్లు చూసి ఉన్నాం. అలాంటి ఓ సాదాసీదా కథలోనే వచ్చే హీరో-హీరోయిన్ల మధ్యన ప్రేమలో కూడా బలమైన ఎమోషన్ కరువైంది. అల్లు అర్జున్-క్యాథరిన్‍ల మధ్యన వచ్చే సన్నివేశాలు క్యూట్‌గానే ఉన్నా, లాజిక్ పరంగా చూస్తే, అవి తేలిపోతాయి. ఇక అల్లు అర్జున్-రకుల్ ప్రీత్‌ల జర్నీ కూడా లాజిక్ లేనట్టే సాగిపోతుంది. ఈ ఒక్క రెండు అంశాలే కాకుండా సినిమాలో చాలాచోట్ల లాజిక్ అన్న అంశానికి చోటు లేదు.

రెండున్నర గంటలకు పైగా చెప్పాల్సిన స్థాయి ఉన్న కథ కాకపోయినా సినిమాను అంత నిడివిలో చెప్పాలనుకోవడం ఓ మైనస్ పాయింట్‌గానే చెప్పుకోవాలి. అలాగే మాస్ అనే ఆంశాన్నే పట్టుకొని కొన్నిచోట్ల యాక్షన్ సీన్లలో అతి ఎక్కువ చేసినట్లు కనిపించింది. ఈ క్రమంలో హింస, రక్తం చాలా ఎక్కువయ్యాయి. ఇక ఫస్టాఫ్ స్థాయిలో సెకండాఫ్ లేకపోవడం వల్ల సెకండాఫ్ నుంచి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తే నిరుత్సాహం తప్పదు. వ్యవస్థలోని లోపాలను హీరో ఒంటిచేత్తో ఎదుర్కోవడమనే పాయింట్ మాస్ అంశంగా చూస్తే ఫర్వాలేదనిపించినా, ఓవరాల్‌గా చూస్తే ఇదంతా ఓవర్‌గా కనిపిస్తుంది. అదీకాకుండా హీరో మిలిటరీ ఉద్యోగాన్ని వదిలేసి ఎందుకు వచ్చాడన్న దానిపై కూడా పూర్తి క్లారిటీ ఉండదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే, ముందుగా దర్శకుడు బోయపాటి శ్రీను గురించి చెప్పుకోవాలి. బోయపాటి రాసుకున్న కథ పూర్తిగా కమర్షియల్ అంశాలనే నింపుకొని చెప్పుకోవాల్సినంత కొత్తగా ఏమీ లేదు. అయితే ఆ కమర్షియల్ అంశాలనే ప్రధానంగా చేసుకొని బోయపాటి అల్లిన మాస్ ఫైట్స్, కొన్ని ఎమోషనల్ సీన్స్ రచయితగా ఆయన మార్క్ చూపెడతాయి. ఇక దర్శకుడిగా బోయపాటికి ఓ స్పెషల్ మార్క్ ఉంది. ఈ సినిమాలో ఆయన మార్క్‌ని మళ్ళీ చూడొచ్చు. హీరోయిజంని ఎలివేట్ చేసే సన్నివేశాలతో పాటు కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లోనూ భోయపాటి ప్రతిభను చూడొచ్చు.

ఇక సంగీత దర్శకుడు థమన్ అందించిన పాటలు సినిమాకు హైలైట్స్‌లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే పాటలన్నీ సూపర్ హిట్ కాగా, విజువల్స్‌తో కలిపి చూసినప్పుడు ఆ పాటల స్థాయి మరింత పెరిగిందనే చెప్పాలి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పరంగానూ థమన్ బాగా ఆకట్టుకున్నాడు. రామ్-లక్ష్మణ్ రూపొందించిన ఫైట్స్‌ సినిమాకు మంచి మాస్ ఫీల్ తెచ్చిపెట్టాయి. రిషీ పంజాబి సినిమాటోగ్రఫీకి ఎక్కడా వంక పెట్టలేం. కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ ఫర్వాలేదు. ఎం.రత్నం అందించిన డైలాగ్స్ కూడా బాగున్నాయి. అల్లు అరవింద్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే!

తీర్పు :

తెలుగులో మాస్ సినిమా అంటే ముందే తయారు చేసి పెట్టుకున్న ఓ ఫార్మాట్ ఉంది. అల్లు అర్జున్‌ని పూర్తి స్థాయి మాస్ హీరోగా పరిచయం చేసే సినిమాగా ప్రచారం పొందిన ‘సరైనోడు’ కూడా అదే ఫార్మాట్‌ను నమ్ముకొని వచ్చిన మాస్ ఎంటర్‌టైనర్. ఫార్మాట్ ప్రకారమే సాగే సినిమా అయినా, పొందిగ్గా అల్లిన మాస్ ఎలిమెంట్స్; అదిరిపోయే హీరో, విలన్‌ల క్యారెక్టరైజేషన్, నటన; వినడానికి, చూడడానికి బాగున్న పాటలు; బన్నీ ఒక పూర్తి స్థాయి మాస్ హీరోగా నిలబడగలనని నిరూపించేలా తనని తాను మలుచుకున్న విధానం లాంటివి ఈ సినిమాకు మంచి ప్లస్ పాయింట్స్‌గా నిలుస్తాయి. ఇకపోతే కథ మరీ పాతది కావడం, లాజిక్ అన్న అంశానికి సినిమాలో పెద్దగా చోటన్నది లేకపోవడం, కాస్త లెంగ్త్ ఎక్కువవ్వడం లాంటివి ఈ సినిమాకు మైనస్ పాయింట్స్‌గా చెప్పుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ ‘సరైనోడు’, ఏయే అంశాలైతే చెప్పబోతున్నాడని ప్రచారం పొందాడో, ఆయా అంశాలనే చెప్పుకుంటూ వస్తూ ఓ మాస్ పంచ్ ఇస్తూ ఆకట్టుకోవడంలో చాలావరకు విజయం సాధించాడనే చెప్పాలి.



మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us



Facebook          Twitter          YouTube          Blog          Google+

No comments:

Post a Comment